రాజా.. రిస్క్ అవసరమా..!

ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు పెద్దగా వివాదాల్లోని లేని నాయకులు..మంత్రులు అవ్వగానే ఏదొక వివాదంలోకి వస్తూనే ఉంటున్నారు. అయితే చేతులారా చేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులని తిట్టే కార్యక్రమంలో కొందరు మంత్రులు నోరు జరుతున్నారు. ఏపీలో మంత్రుల బాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే కొందరు హుందాగానే మాట్లాడతారు. కానీ కొందరు మాత్రం పదవి నిలబెట్టుకోవడం కోసమా? లేక జగన్ మెప్పు పొందడం కోసమో తెలియదు గాని..ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడతారు.

ఇప్పుడు మంత్రి దాడిశెట్టి రాజా పరిస్తితి కూడా అదే. తుని నుంచి వరుసగా రెండు సార్లు యనమల ఫ్యామిలీకి చెక్ పెట్టి సత్తా చాటిన రాజాకు..నియోజకవర్గంలో మంచి పేరుంది. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతా బాగుంది గాని..మంత్రి అయ్యాకే రాజా వర్షన్ మారిపోయింది. ఈయన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యర్ధులని దూషించే విషయంలో రాజా కూడా పోటీ పడుతున్నారు. తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడుతున్నారు.

అయితే ఇక్కడ టీడీపీ లేదా చంద్రబాబు వరకే తన విమర్శలు ఉంటే పర్లేదు. అది దాటేసి ఏకంగా ఎన్టీఆర్‌పైనే విమర్శలు చేసేస్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళు ఏమో ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరం చేయాలని చూస్తుంది. అలాగే ఎన్టీఆర్ అభిమానులని తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. కానీ రాజా ఏమో..ఎన్టీఆర్‌పైనే విమర్శలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో ఇప్పటికే వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలోనే  ఎన్టీఆర్, వైఎస్సార్ మధ్య పోలిక తేవడంపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి రాజా.. రామారావు అంత చేతకానోడు దేశంలోనే లేడని, రాష్ట్రమంతా గుప్పిట్లో ఉండగా, సీఎంగా ఉండగా రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడని,  సీఎంగా ఉండి రెండుసార్లు నాదెండ్ల భాస్కరరావు, అల్లుడు చంద్రబాబుతో వెన్నుపోట్లు పొడిపించుకున్నారని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని మాట్లాడారు.

ఇక రాజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాజా నోటిని ఫినాయిల్‌తో కడగాలని, దాడిశెట్టి రాజా వీధి కుక్కలా మాట్లాడుతున్నారని బుచ్చయ్య చౌదరీ లాంటి ఫైర్ అయ్యారు. అయితే రాజకీయంగా బాబుపై విమర్శలు చేయడం, లేదా ఆయన్ని బూతులు తిడితే..అది రాజకీయం బట్టి ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఏకంగా ఎన్టీఆర్‌పైనే విమర్శలు చేయడం అనేది రాజాకు రిస్క్ పెంచే అంశం. మరి ఆ విషయం రాజాకు అర్ధమవుతుందో లేదో చూడాలి.