గుడివాడ‌లో కొడాలి నానిపై టీడీపీ క్యాండెట్ ఎవ‌రు.. ముహూర్తం పెట్టిన బాబు..!

ఏపీలో కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నానికి కంచుకోటగా మారిపోయింది. అసలు ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా నాని వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2004 – 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన నాని 2014 – 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి నుంచి తనకు కంచుకోటగా ఉంటూ వచ్చారు. అసలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పోటీ చేసిన గుడివాడలో టిడిపి తరఫున బలమైన అభ్యర్థి కూడా కనపడటం లేదు.

ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తాత్కాలిక ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఎదిగిన నాని… టిడిపిలో పూర్తిగా బలం పెంచుకునే వైసీపీలోకి వెళ్లడంతో టీడీపీకి మైనస్ అయింది. 2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నానీని ఢీ కొట్టేందుకు విజయవాడ నుంచి దేవినేని అవినాష్ తీసుకువచ్చి పోటీ చేయించారు. అయినా కూడా అవినాష్ చిత్తుగా ఓడిపోయారు.

నాని మంత్రిగా ఉండడంతో చంద్రబాబు, లోకేష్‌ల పై ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నారు. అసలు నానికి తెలుగుదేశం పార్టీ నుంచి సరైన కౌంటర్లు ఇచ్చే నేతలు కూడా కనపడటం లేదు. నాని మంత్రిగా ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మ‌రింత బ‌ల‌ప‌డ్డారు. ఇక అవినాష్ కూడా వైసీపీలోకి వెళ్లిపోవడంతో తాత్కాలికంగా రావి వెంకటేశ్వరరావు ఇన్చార్జిగా కొనసాగిస్తున్నారు. గుడివాడలో నానిని ఓడించాలంటే నందమూరి ఫ్యాక్టర్ పని చేయాలని.. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యను ఇక్కడ నుంచి పోటీ చేయించాలని పార్టీలోని కొందరు నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నారు.

అయితే ఇప్పటికే వరుసగా రెండుసార్లు హిందూపురంలో గెలిచిన బాలయ్య మరోసారి కూడా అక్కడ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరిని గుడివాడలో పోటీకి నిలబెట్టాలని చంద్రబాబుపై పార్టీ నుంచి ఒత్తిళ్లు అయితే మొదలయ్యాయి. మే నెలలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం వేదికగా నారా – నందమూరి ఫ్యామిలీ ఏకం కాబోతున్నాయి. ఈ కార్యక్రమం తర్వాతే ఈ రెండు ఫ్యామిలీల‌తో చర్చించి చంద్రబాబు గుడివాడ అభ్యర్ధి విషయంలో క్లారిటీ కి వస్తారని తెలుస్తోంది.