కేరళ ‘ ఐరన్ లేడీ’ మృతి…!

కమ్యూనిస్టులు..నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తుంటారు. ప్రజల కోసం ధర్నాలు, పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ప్రజలకు చెందాల్సిన న్యాయం కోసం పోరాడుతుంటారు. ఆ కోవకు చెందిన ఓ యోధురాలు నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. కేరళలోని దిగ్గజ కమ్యూనిస్ట్ కేఆర్ గౌరీ మంగళవారం తన తుదిశ్వాస విడిచారు. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపాయి. 102 సంవత్సరాలు వయసుగల ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యం రీత్యా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

అయితే ఆరోగ్యం విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. ఆమె 1957 లో కమ్యూనిస్ట్ లెజెండ్ ఇఎంఎస్ నంపూతిరిపాడ్ నేతృత్వంలోని ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ మంత్రివర్గంలో సభ్యురాలుగా ఉన్నారు. మొదటి కేరళ శాసనసభ నుండి 1977 వరకు ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మొత్తం ఆరు క్యాబినెట్లలో 16 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 1952లో ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభకు ఎన్నిక కావడంతో గౌరీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కాగా భూ సంస్కరణ బిల్లు విషయంలో ఆమె చేసిన పోరాటం కేరళ ప్రజలకు సుపరిచితం.