నంద్యాల టీడీపీ పంచాయితీలో ట్విస్టులే..ట్విస్టులు

దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో మొద‌లైన సెగ‌లు.. ఇంకా చ‌ల్లార‌డం లేదు. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య వివాదం స‌మ‌సిపోగా.. ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య తెర‌పైకి వ‌చ్చింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంలో ఇంకా సందిగ్ధం వీడ‌లేదు. దీంతో నంద్యాల రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కొన్నిరోజులుగా పార్టీలో ఉందామా వ‌ద్దా అనే మీమాంస‌లో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డికి అధిష్టానం వ‌రుస‌గా షాకులు ఇస్తోంది. ఉప ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని ఆశిస్తున్న ఆయ‌న్ను దూరం పెట్టాల‌ని సీఎం భావిస్తున్నార‌ట‌. దీంతో పంచాయితీ ఎడ‌తెగ‌డం లేదు.

రాజకీయ భవితవ్యంపై ఊగిసలాటలో ఉన్న సీనియర్ నాయకుడు శిల్పామోహన్ రెడ్డికి సీఎం చంద్ర‌బాబు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసి క్యాడర్‌ని కాపాడుకుందామని శిల్పా బ్రదర్స్ చూస్తుంటే వారికి పార్టీ అదిష్టానం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ వచ్చే అవకాశం లేదని నిర్ధారించుకున్న శిల్పామోహన్ రెడ్డి.. వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వినిపించాయి. దీంతో టీడీపీ నాయకత్వం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడును రంగంలోకి దింపి బుజ్జ‌గింపులు చేప‌ట్టింది.

అచ్చెన్నాయుడుతో భేటీ అనంతరం శిల్పామోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు అమరావతిలోని స‌చివాల‌యానికి చేరుకు న్నారు. సీఎం కోసం చాలా సేపు ఎదురుచూశారు. కానీ వారికి నిరీక్షణే మిగిలింది. పలు మీటింగ్ లలో పాల్గొన్న బాబు.. అవి ముగించుకొని నేరుగా ఉండవల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో షాక్కు గురవడం శిల్పా సోదరుల వంతు అయింది! ఈ విషయం పార్టీ నేతలు చెవిన వేయడంతో సచివాలయంలో కలిసే వీలు పడలేదని అందుకే ఇంటికి వచ్చి కలవాల్సిందిగా చంద్రబాబు వారికి సమాచారం పంపారు.

పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇలాంటి పరాభవాలు ఎదురవడంపై శిల్పా మోహన్ రెడ్డి కలత చెందిన‌ట్లు సమాచారం. అందుకే ఉప ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే తన వర్గానికి ఉనికే ఉండదని శిల్పా బ్రదర్స్ వాపోతున్నారు. శిల్పా సోదరులతో మంత్రులు ఆదినారాయణరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విడతల వారిగా చర్చలు జరిపారు. శిల్పా వాదనను సోమిరెడ్డి సీఎం దృష్ణికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా… సంప్రదాయం ప్రకారం టిక్కెట్ తమకే దక్కాలాని భూమా కుటుంబం తమ వాదనను వినిపిస్తోంది.