టీజేఏసీ లో లుకలుకలు…కేసీఆర్ ప్లాన్స్ సక్సెస్..!

ఇన్నాళ్లూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఐక్యంగా పోరాడిన.. టీజేఏసీలో విభేదాలు భగ్గుమన్నాయి! టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌లు లేఖాస్త్రం సంధించ‌డం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఐక్యంగా ఉన్న నేత‌లు ఒక్క‌సారిగా కోదండ‌రామ్‌పై ఎదురుదాడికి దిగ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని తెలుస్తోంది.

ముఖ్యంగా సొంత పార్టీ దిశ‌గా కోదండ‌రామ్ అడుగులు వేస్తున్న వేళ‌.. టీజేఏసీలో లుక‌లుక‌లు దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఈ లుక‌లుక‌ల వెనుక సీఎం కేసీఆర్ చాతుర్యం ఉన్నట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టీజేఏసీ విచ్చిన్నం అవడంలో కేసీఆర్ ప్లాన్ సూప‌ర్ స‌క్సెస్ అయింద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!!

సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ స‌ర్కార్‌పై టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్ కొంత‌కాలంగా తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. అయితే స‌మ‌యం కోసం ఎదురుచూసిన కేసీఆర్‌.. ఇప్పుడు గురిచూసి దెబ్బ‌కొట్టారు. త‌న వ్యూహాల‌తో కోదండ‌రామ్‌ను ఇరుకున పెట్టేశారు! తాను రంగంలోకి దిగితే.. ఎలా ఉంటుందో కోదండరామ్‌కు తెలిసొచ్చేలా చేశారు. టీజేఏసీలోనే లుక‌లుక‌లు సృష్టించ‌డంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌లే విమ‌ర్శ‌లు చేసేలా చేయ‌గ‌లిగారు. కోదండ‌రామ్ తీరును ఎండ‌గ‌డుతూ.. జేఏసీ క‌న్వీన‌ర్ లేఖాస్త్రం సంధించారు.

రాజకీయ పార్టీ ప్రకటనను తరచూ ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర.. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడి వెళ్లిపోవటం మినహా కోదండం చేసింది ఏమైనా ఉందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఉద్యమ సందర్భంగా పలువురు నష్టపోయారని.. కోదండం మాత్రం నష్టపోయిందేమీ లేదంటూ తప్పు పట్టారు. `ఇప్పటికైనా తీరుమార్చుకోండి. ఎంతసేపూ స్వీయ ఆస్తిత్వం కోసం పాకులాడటమేనా? తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పే అవకాశాన్ని టీజేఏసీ నేతలకు ఎందుకు ఇవ్వరు?` అంటూ  ప్రశ్నించడం గ‌మ‌నార్హం!!

తాజాగా.. కోదండరామ్‌పై తాను చేసిన ఆరోపణలపై టీజేఏసీలో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు నేత‌ల‌తో ర‌వీంద‌ర్‌ ఒక హోటల్లో సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించార‌ట‌. దీంతో భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై మంత‌నాలు జ‌రిపార‌ట‌. దీనికి పలు జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు హాజరై.. కోదండరాంపై రవీందర్ అండ్ కోలు రాసిన లేఖపై చర్చించారు. అందులోని అంశాల్ని ఆమోదించటం ద్వారా.. ఇంత కాలం విమర్శలుగా ఉన్నవాటికి.. జేఏసీలో పలువురు నేతల మద్దతు ఉందన్న విషయాన్ని తేల్చేసినట్లైంది. మ‌రి జేఏసీ విడిపోతే ఇక కోదండ‌రామ్‌ని ఒంట‌రి చేయ‌డంలో కేసీఆర్ సూప‌ర్ స‌క్సెస్ సాధించిన‌ట్టే!!