ఆ వైకాపా ఎంపీ ప‌ద‌వి ఉంటుందా..ఊడుతుందా..!

నిజ‌మే.. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ఇలానే అనుకుంటున్నారు.. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత గురించి! ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతుండ‌డ‌మే దీనికికార‌ణంగా క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న కులం, త‌ర్వాత భూములు, ఇప్పుడు మ‌ళ్లీ కులం.. ఇలా ఊపిరాడ‌నివ్వ‌ని వివాదాల్లో గీత కూరుకుపోతున్నారు. దీంతో అస‌లు ఆమె ఎంపీ ప‌ద‌విలో ఉంటుందా?  లేక మొత్తానికే ఎస‌రు వ‌స్తుందా? అనేది పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆమె ఎంపీగానే ఉన్నా.. ఏ పార్టీ ఎంపీనా? అనేది కూడా జ‌నాల‌కు క్లారిటీ లేనంత వివాదంలో కూరుకుపోయిన గీత గురించి తెలుసుకుందాం..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాజీ ఆర్‌డీవో అయిన  కొత్త‌ప‌ల్లి గీత‌ పొలిటిక‌ల్ అవ‌తారం ఎత్తి.. 2014 ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌ఫున విశాఖ జిల్లా అర‌కు గిరిజ‌న రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేశారు. అప్ప‌టి వైకాపా అధినేత జ‌గ‌న్ కు ఉన్న ఫేమ్‌తో గీత సునాయాశంగా విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత ఆమె ఒక్క‌సారిగా జ‌గ‌న్‌కి హ్యాండిచ్చారు. దాదాపు టీడీపీలోకి ఎంట‌ర్ అయిపోయేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే, అంత‌లోనే ఆమె కులంపై పెద్ద ర‌గ‌డ మొద‌లైంది. దీంతో చంద్ర‌బాబు ఆమెను ఆహ్వానించ లేద‌నే టాక్ వ‌చ్చింది.

ఈ కులం విష‌యం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వెళ్ల‌డంతో విచార‌ణకు ఆదేశించిన సంఘం.. క‌లెక్ట‌ర్ ఆమెను ఎస్టీగానే తేల్చ‌డంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇక‌, ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీలో తాను ఆర్‌డీవోగా ఉన్న స‌మ‌యంలో సాగించిన దందా నేప‌థ్యంలో 60 ఎక‌రాల భూమిని క‌బ్జాచేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుమారుడు రంగం ప్ర‌వేశం చేయ‌డం, ఈ వివాదం నేప‌థ్యంలో గీత పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలిచారు. ఇప్ప‌టికీ ఈ వివాదం సాగుతూనే ఉంది.

ఇక‌, మ‌ళ్లీ ఆమెకు కులం వివాదం చుట్టుముట్టింది. ఆమెకాపు సామాజిక వ‌ర్గానికి కాద‌ని క‌లెక్ట‌ర్ తీర్మానిస్తూ.. నివేదిక ఇవ్వ‌డాన్ని శెట్టి గంగాధ‌ర స్వామి అనే వ్య‌క్తి కోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. ఆమె ఎస్టీ కాద‌ని, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి ఆయ‌న స్వామి వాద‌న. దీనిపై ఆయ‌న కోర్టుకు వెళ్ల‌డంతో ఇది సంచ‌ల‌నంగా మారింది. దీనిపై విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశించ‌డం మ‌రో సంచ‌ల‌నం. దీంతో ఇది నిజ‌మ‌ని తేలితే.. గీత ఎస్టీ కాద‌ని రుజువు అయితే.. ఆమె ఎంపీ ఎన్నిక ర‌ద్ద‌వుతుంది. అదే స‌మ‌యంలో ఆమె ఎస్టీ అని పేర్కొంటూ నివేదిక ఇచ్చిన క‌లెక్ట‌ర్‌కు చ‌ర్య‌లు త‌ప్ప‌వు. ఇదీ.. అర‌కు ఎంపీ గీత.. క‌థ!