కాపు ఉద్య‌మంలో లుక‌లుక‌లు!

కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ.. ఉద్య‌మిస్తున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆశ‌లు తీర‌తాయా? అస‌లు కాపు వ‌ర్గానికి చెందిన నేత‌లంద‌రూ ఒక్క దారిలోకి వ‌చ్చి ముద్ర‌గ‌డ కోరుతున్న‌ట్టు ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టిస్తారా? ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లుకుతారా? అంటే ఇప్పుడు ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోతున్నాయి. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాపు ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ప్పుడు ఉన్న వేడి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, కాపు నేత‌ల మ‌ధ్యే పెద్ద ఎత్తున లుక‌లుక‌లున్న‌ట్టుగా తెలుస్తోంది. నిన్న‌టికి నిన్న సీఐడీ ముందు హాజ‌రైన నెంబ‌ర్ -1 టీవీ ఎండీ సుధాక‌ర్ నాయుడు వ్య‌వ‌హార‌శైలే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది.

తుని విధ్వంసంపై విచార‌ణ చేస్తున్న సిట్ అధికారుల ఎదుట నాయుడు సోమ‌వారం హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు షాకింగ్ విష‌యాలు అధికారుల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కాపుల‌కు రిజర్వేష‌న్ వ‌స్తానంటే జైలుకు వెళ్లేందుకు సైతం తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న అదేస‌మ‌యంలో కాపు ఉద్య‌మానికి శ్రీకారం చుట్టిన ముద్ర‌గ‌డ‌పై విమ‌ర్శ‌లు గుప్పించార‌ని స‌మాచారం.

ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌కు గాయాలైనా ముద్ర‌గ‌డ‌ ప‌ట్టించుకోలేద‌ని, క‌ర్రీలో క‌రేపాకులా చూశాడ‌ని, ఆయ‌న రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే తుని విధ్వంసం జ‌రిగింద‌ని, డ్రోన్ కెమెరాల‌ను ఆయ‌న కుమారుడే ఏర్పాటు చేశాడ‌ని ఇలా నాయుడు ప‌లు అంశాలు సిట్ అధికారుల ముందు వెల్ల‌డించార‌ట‌. దీనిని బ‌ట్టి.. కాపు సామాజిక వ‌ర్గంలోని పైస్థాయి నేత‌ల‌మ‌ధ్యే ఒక క్లారిటీ లేద‌నేది స్ప‌ష్ట‌మైపోతోంది. ఇక‌, ఎప్పుడు తాను ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నా.. హైద‌రాబాద్ వ‌చ్చి సినీ కాపు ప్ర‌ముఖులైన దాస‌రి నారాయ‌ణ‌రావు, చిరంజీవిల‌ను క‌లిసి వారి మ‌ద్ద‌తు కోరుతూ ఉంటారు ముద్ర‌గ‌డ‌.

అయితే, అస‌లు ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖుల మ‌ధ్య ఎంత‌వ‌ర‌కు క్లోజ్ నెస్ ఉంద‌నేది పెద్ద ప్ర‌శ్న‌! వీరిద్ద‌రూ ఎప్ప‌టి నుంచో మాట్లాడుకోవ‌డ‌మే లేదు. అలాంటిది వీరిని కాపు ఉద్య‌మం కోసం ఓ తాటిపైకి ఎలా తీసుకునిరాగ‌ల‌రో ముద్ర‌గ‌డ‌కే తెలియాలి. ఇక‌, కాపుల్లో మాంచి గుడ్ ఇమేజ్ ఉన్న ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఉద్య‌మానికి క‌లిసి రావ‌డం క‌ష్ట‌మే. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ముద్ర‌గ‌డ త‌న ఉద్య‌మాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. ఏదేమైనా.. కాపు నేత‌ల్లో పైకి క‌నిపిస్తున్న ఫ్రెండ్షిప్‌.. లోలోన లేద‌నేది స్ఫ‌ష్ట‌మైపోతుండ‌డం గ‌మ‌నార్హం.