రోశయ్యకు పదవీ గండం…

త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశ‌య్య.. త్వర‌లోనే ఇంటి ముఖం ప‌డ‌తారా? ఆయ‌నకు ప‌ద‌వీ గండం పొంచి ఉందా? అంటే.. ఔన‌నే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశ‌య్యను కాంగ్రెస్  రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిర‌సావ‌హించిన రోశ‌య్యకు అదే అధిష్టానం త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్ ప‌ద‌విని అప్పజెప్పి గౌర‌వించింది. దీంతో 83 ఏళ్ల రోశ‌య్య త‌మిళ‌నాడుకు 18వ గ‌వ‌ర్నర్‌గా 2011 ఆగ‌స్టు 31న బాధ్యత‌లు చేప‌ట్టారు. త‌మిళ‌నాడులో సీఎం జ‌య ల‌లిత‌కు, గ‌వ‌ర్నర్‌కు ప‌డ‌దు అనే మాట‌ను రోశ‌య్య తుడిచేశారు. సీఎం జ‌య‌ల‌లిత‌తో ఆయ‌న సఖ్యత‌గా ఉంటున్నారు. ఆమె తీసుకునే ఏ నిర్ణయంలోనూ రోశ‌య్య ఎప్పుడూ వేలు పెట్టలేదు. దీనికితోడు రోశ‌య్యని జ‌య అన్నగా సంబోధించ‌డం కూడా మీడియాలో అప్పట్లో హైలెట్ అయింది.

ఇక‌, 2014లో కేంద్రంలో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించిన మోడీ.. ఆ త‌ర్వాత ప‌రిణామాల్లో ప‌లు రాష్ట్రాల్లో గ‌వ‌ర్నర్‌ల‌ను మార్చారు. ఇది ప్రధానిగా ఆయ‌న‌కున్న విశేష అధికారం. దీంతో అప్పట్లోనే త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్ రోశ‌య్యను కూడా సాగ‌నంపుతార‌ని అనుకున్నారు. ఈయ‌న‌కు కాంగ్రెస్ మూలాలు ఉండ‌డంతో మోడీ త‌ప్పకుండా  మారుస్తార‌ని అనుకున్నారు.

అయితే, మోడీ మాత్రం రోశ‌య్య జోలికి పోలేదు.కానీ, తాజాగా క‌ర్ణాట‌క‌లో బీజేపీ సీనియ‌ర్‌నేత  డీహెచ్ శంకరమూర్తిని త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్‌గా పంపాల‌ని మోడీ ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. బీజేపీ జాతీయ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ తో సైతం సత్సంబంధాలు కలిగుండటం, వివాదాలకు దూరంగా ఉంటారన్న మంచి పేరు కారణంగా శంకరమూర్తికి గవర్నర్ గా ప్రమోషన్ ఇవ్వాలని మోడీ ఆలోచిస్తున్న‌ట్టు తెలిసింది. ఇక‌, రోశ‌య్య విష‌యానికి వ‌స్తే..  రాష్ట్రంలో బీజేపీ ఎద‌గాలంటే.. మ‌న వాడంటూ ఒక‌రు అక్క‌డ గ‌వ‌ర్నర్‌గా ఉంటే బాగుంటుంద‌ని మోడీ యోచిస్తున్నార‌ట‌.త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఇటీవ‌ల ఆశించిన ఫ‌లితం ద‌క్కక‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని మోడీ అనుకుంటున్నార‌ట.  శంక‌ర‌మూర్తిని నియ‌మిస్తే.. బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌.  ప్రస్తుతం శంకరమూర్తి కర్ణాటక శాసన మండలికి చైర్మన్ గా ఉన్నారు.

ఇటీవలి మండలి ఎన్నికల అనంతరం, సభలో బీజేపీ బలం తగ్గి, కాంగ్రెస్ పుంజుకుంది. మండలి చైర్మన్ పదవి సైతం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయేలా ఉంది. దీంతో ఆయ‌న‌ను అక్క‌డి నుంచి రిలీవ్ చేసి.. గ‌వ‌ర్నర్‌గా నియ‌మిస్తే.. అన్ని విధాలా బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌!