బాబూ సిగ్గు సిగ్గు:ఆఖరికి అదికూడా కాపీ నా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను ఏపి ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ఉన్నతా ధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపీరైట్స్‌ చట్టం సెక్షన్‌ 63 ప్రకారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ కోర్టు అప్లికేషన్‌ సమాచారం కూడా కాపీకి గురైందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ తీసుకుంది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగ్‌ (ఇఒడిబి) కోసం ఏపి ప్రభుత్వం అడ్డదారులు వెదుకుతోందని, ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ విధానాలను కాపీ కొట్టిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. అన్ని ఆధారాలను మంత్రికి సమర్పించారు.

ఈ సమావేశ అనంతరం మంత్రి కెటిఆర్‌ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాలు ఇఒడిబి ర్యాంకింగుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుమతుల జారీలో పారదర్శకత పెంచేందుకు, రెడ్‌ టేపిజం తగ్గించేందుకు ఇఒడిబి ర్యాంకింగులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అందుకే తమ అంతర్గత విధానాలను, పద్ధతులను సరళీకరించుకొంటున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో నిజంగా మార్పులు చేసిన రాష్ట్రాలకు మాత్రమే తుది ర్యాంకుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, కాపీకొట్టిన వెబ్‌ సైట్లోని సమాచారంతో ఇఒడిబి స్ఫూర్తిని దెబ్బతీస్తున్న రాష్ట్రాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు. జూన్‌ 30 తరువాత ఆయా రాష్ట్రాలు సమర్పించిన సమాచారాన్ని క్షుణ్ణంగా తనీఖీ చేయాలని మంత్రి కోరారు.

మక్కీకిమక్కీ దించేశారు…
ఈ నెల 28న తెలంగాణ ప్రభుత్వం కమర్షియల్‌ కోర్ట్సు అప్లికేషన్‌ను ఇఒడిబి కోసం సమర్పించగా, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తొలి గడువు జూన్‌ 30 అర్ధరాత్రి వరకు ఈ అప్లికేషన్‌ సమర్పించలేదు. తీరా కేంద్ర ప్రభుత్వం ఒక వారం గడువు పెంచగానే హడావిడిగా తెలంగాణ ప్రభు త్వం రూపొందించిన సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను యథాతథంగా కాపీకొట్టి కేంద్రానికి సమర్పించింది. తెలంగాణ అప్లికేషన్‌లో ఉన్న అక్షరదోషాన్ని కూడా పరిశీలించకుండా ఏపి మక్కీకిమక్కీ దించింది. టిఎస్‌ ఐపాస్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు కోసం సబ్‌మిషన్‌ రిఫరెన్సు నంబర్‌ను రూపకల్పన చేసింది. ఇది తెలంగాణకు మాత్రమే ఉన్న ఒక నంబర్‌ను అనే పదాన్నే ఉపయోగించింది. తమ అప్లికేషన్‌ను కాపీకొట్టి చేసిన ఈ మార్పులతో సడన్‌గా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ర్యాంకు మెరుగుపడిందని తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులంటున్నారు.