కేవీపీకి టీడీపీ సపోర్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఊహించని మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే… దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా… పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.కాగా గత సమావేశాల్లోనే కేవీపీ బిల్లు పెట్టినా అప్పట్లో దానిపై చర్చ సజావుగా సాగకుండా టీడీపీ సభ్యులు కొంత ప్రయత్నం చేశారు. టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. నిజానికి కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టడమన్నది కీలక పరిణామమే. ప్రత్యేక హోదా చట్టంలో లేదని తప్పించుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే కేవీపీ ఈ బిల్లు పెట్టారు.

ప్రత్యేక హోదా సాధనే దాని లక్ష్యం.. కానీ. అదే లక్ష్యంతో పనిచేస్తున్న ఇతర ఏపీ పార్టీలు ఆ విషయంలో కేవీపీతో కలిసి వెళ్లలేదు.అయితే… ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో పెరుగుతున్న కాంక్ష. టీడీపీ ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడీ బిల్లుకు మద్దతు పలకకపోతే మాట పడతామని టీడీపీ ఆందోళన చెందుతోంది. దాంతో పాటు బీజేపీని ఇరుకునపెట్టేందుకు కూడా తాము కాంగ్రెస్ తో కలవడం అవసరమని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కలతోనే చంద్రబాబు దీనికి ఓకే అన్నారని తెలుస్తోంది.