ఇది విన్నారా.. జకీర్‌ కి ఏపాపం తెలియదట

ఈ మధ్యనే బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటన వెనుక ఇస్లాం మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ ప్రసంగాలే కారణమని ప్రచారం జరుగుతుండగా, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించేశారు. అజ్ఞాత ప్రాంతం నుండి స్కైప్‌ ద్వారా జకీర్‌ నాయక్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పారు.

ఇస్లాం హింసకు వ్యతిరేకమని తానెప్పుడూ హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేయలేదని వివరించారు. అయితే జకీర్‌ నాయక్‌ ప్రసంగాలలో తీవ్రవాదం పట్ల ముస్లిం యువత ఆకర్షితులయ్యేలా అనేకానేక ప్రస్తావనలున్నాయని ససాక్ష్యంగా ప్రపంచ మీడియా అభివర్ణించింది. మనదేశంతోపాటు, బంగ్లాదేశ్‌లోనూ జకీర్‌నాయక్‌ వీడియో ప్రసంగాలపై నిషేధం విధించారు. జకీర్‌నాయక్‌పై ఢాకా తీవ్రవాద ఘటన అనంతరం విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలకు జకీర్‌నాయక్‌ వివరణ ఇవ్వబోతున్నారని వార్తలు వినవస్తుండగా ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ రోజు ఫ్రాన్స్‌లో జరిగిన తీవ్రవాద ఘటనను జకీర్‌ నాయక్‌ ఈ సందర్భంగా ఖండించారు. అయితే తన ప్రసంగా లద్వారా యువతను తీవ్రవాదం వైపు మళ్ళేలా చేసిన జకీర్‌ నాయక్‌ ఇప్పుడు మాట మార్చడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంకో వైపున జకీర్‌ నాయక్‌ తన ప్రసంగాలను వక్రీకరించారంటూ ఆరోపణలు చేస్తున్నాడు.