హైదరాబాద్‌కి టెర్రర్‌ టెన్షన్‌ 

చారిత్రక నగరం హైదరాబాద్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వర్ధిల్లుతోంది. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన వెలుగు చూసినా దానికి హైదరాబాద్‌తో లింకులుంటున్నాయి. ఇదివరకటితో పోల్చిచూసినప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినట్లే అనిపిస్తున్నప్పటికీ ప్రపంచానికి పెను సవాల్‌ విసురుతున్న ఐసిస్‌తో హైదరాబాద్‌కి లింకులున్నట్లుగా బయటపడుతుండడం ఆందోళన కలిగించేదే. తాజాగా హైదరాబాద్‌లో ఐసిస్‌ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్‌ఐఏ గుర్తించింది. పలువురు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసింది. ఐసిస్‌ సానుభూతిపరులు నగర శివార్లలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో తుపాకీలతో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. వీరి నుంచి పేలుడు పదార్థాల్ని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకుంది.

తెలంగాణ, కర్నాటక పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఐసిస్‌ సానుబూతిపరులు రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానాలు వెల్లువెత్తుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల్లో రంజాన్‌ పండుగ జరుగనుండడం, ఆ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించే వినాయక చవితి, నిమజ్జనోత్సవాల నేపథ్యంలో తీవ్రవాదుల కలకలంతో ఒక్కసారిగా భాగ్యనగరం ఉలిక్కిపడింది. అయితే ఎన్‌ఐఏ చొరవతో పెను ప్రమాదం ప్రస్తుతానికి తప్పిందని భావించవచ్చు. పట్టుకున్న తీవ్రవాదుల నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో పడింది ఎన్‌ఐఎ.