చిరుత పులితో సెల్ఫీల కోసం ఎగబడిన జనం…!

శివంగాలప‌ల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచారం ఎప్పుడు టెన్షన్ రేపు తోనే ఉంటుంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఇటీవల ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున తల్లి చిరుత ఆ పిల్లల‌ను తీసుకుని వెళుతుండగా పొలం పనులకు వెళ్లిన ఓ రైతు చూసి గ్రామ సర్పంచ్కు సమాచారం అందించాడు. జనం అలజడి ఉండడంతో చిరుత ఒక పిల్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఆ రైతు అక్కడే ఉండి తల్లి చిరుత‌ మళ్ళీ వస్తుందని రైతు కాస్త దూరంలో చట్టపదల మాటను రెండు గంటల పాటు చూసాడు.

చిరుత రాకపోవడంతో పిల్ల చిరుతను జాగ్రత్తగా సంరక్షించాడు. ఇక ఈ విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులతో పాటు జనం కూడా క్యూ కట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కానరావుపేట మండలం శివారు అడవి ప్రాంతంలో చిరుత పులి సంచారం ఎప్పటినుంచో జనాన్ని భయభ్రాంతులను చేస్తుంది. మండల కేంద్ర సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చిందన్న సమాచారం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పులి పిల్లలను చూసేందుకు జనం భారీగా వెళ్ళారు. సమీప గ్రామాల ప్రజలు చిరుత పులి పిల్లను ఆసక్తిగా చూస్తూ సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.

అక్కడికి చేరుకొన్న ఫారెస్ట్ ఆఫిస‌ర్స్‌ అప్పటికే చలికి వ‌ణికిపోతున్న చిరుత పులి పిల్లను సంరక్షించి దానికి పాలు తాగించి అదే ప్రాంతంలో పిల్లను వదిలేసారు. సిరిసిల్ల రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ బాపిరాజులు అక్కడికి వచ్చిన ప్రజలను పంపించి తిరిగి చిరుత పులి అక్కడికి వచ్చేలా జనం లేకుండా చేశారు. చిరుతపులి వెళ్లిన ప్రాంతానికి మండల ప్రజలు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

తల్లి చిరుత వచ్చి పిల్లలను తీసుకువెళ్తుందని కొంత సమయం పాటు చూసిన తరువాత తల్లి చిరుత రాకపోతే కరీంనగర్ కు తరలిస్తామని చెప్పుకొచ్చాడు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 6 చిరుత‌లు ఉన్నాయని.. ఇప్పుడు రెండు చిరుతలు రావడంతో వాటి సంఖ్య 8కి మారిందని అంచ‌నా. ఇక పిల్ల చిరుత కోసం తల్లి ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు అడవిశాఖ అధికారులు.