గంటాని అడ్డం పెట్టుకుని ఆట మొద‌లెట్టేశారు…

ఏపీలో ఇప్పుడు విశాఖ భూదందా కేసు వాడి వేడి సెగ‌లు పుట్టిస్తోంది. అధికార ప‌క్షంలోనే నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటూ.. విప‌క్షం ప‌నిని తామే చేసేసుకుంటున్నారు. విశాఖ‌లో భారీ ఎత్తున భూములు కొల్ల‌గొడుతున్నారంటూ మంత్రి అయ్య‌న్న పాత్రుడే నేరుగా మీడియా మీటింగ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు, దీనిపై సీఎం చంద్ర‌బాబుకు నేరుగా ఆయ‌న లే ఖ కూడా రాసేశారు. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తున్న టీడీపీ మిత్ర ప‌క్షం బీజేపీ.. ముఖ్యంగా బీజేపీ ఏపీ నేత‌లు త‌మ‌కు టీడీపీపై ఉన్న అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కేస్తున్నారు.

ఇప్ప‌టికే మొన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన అమిత్ షా మీటింగ్‌లో బాబుతో క‌ట్ చేసుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు వారు ఈ విశాఖ విష‌యాన్ని అందివ‌చ్చిన అవ‌కాశంగా భావిస్తున్నారు. ఈ కేసులో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాస‌రావు కేంద్రంగా బీజేపీ నేత సోము వీర్రాజు.. తాజాగా సీఎం చంద్ర‌బాబుకు లేఖ‌రాశారు. విశాఖ భూదందా విష‌యంలో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ లేఖ‌లో సోము వీర్రాజు కోరారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ పంచ‌న చేరేవారికి అవ‌కాశాలు ఇవ్వ‌కూడ‌ద‌నీ, అలాంటి వారికి రాజ‌కీయాల్లో ప్రాధాన్య‌త ద‌క్క‌కూడ‌ద‌ని వీర్రాజు లేఖ‌లో పేర్కొన్నారు.

నిజానికి సోము ఈ వ్యాఖ్య‌లు నేరుగా గంటాను ఉద్దేశించే చేశారు. గంటానే గ‌తంలో పీఆర్ పీ, త‌ర్వాత కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీలో చెంగు చెంగున జంప్ చేసుకుంటూ.. ప‌ద‌వుల్లో ఆరితేరుతున్నారు. కాబ‌ట్టి.. ఈ విష‌యాన్ని నేరుగా ప్ర‌స్థావించ‌క‌పోయినా.. సోము తెలివిగాగంటాపై దాడి ముమ్మ‌రం చేస్తూనే.. ప‌రోక్షంగా టీడీపీ మంత్రులు ఇలా రోడ్డెక్కి త‌న్నుకుంటున్నారంటూ.. ఢిల్లీ అధిష్టానానికి ఉప్పందిస్తున్నార‌ని స‌మాచారం.

ఇప్పుడు ఢిల్లీలోని క‌మ‌ల ద‌ళాధిప‌తులు ఈ విష‌యంపై గ‌ట్టిగా దృష్టి పెట్టి .. బాబుతో క‌టీఫ్ చేసుకోవాల‌ని సోము మ‌న‌సులో కోరిక అయి ఉండ‌వ‌చ్చు. ఏదేమైనా.. ఢిల్లీ పెద్ద‌లు ఈ విష‌యంపై దృష్టి పెడితే.. బాబుకు 2019లో బీజేపీ క‌టీఫ్ చెప్ప‌డం ఖాయం.