పాల్వాయి మ‌ర‌ణం వాళ్ల‌కు రిలీఫ్‌…. ఈయ‌న‌కు మైన‌స్‌

తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా త‌న‌దైన స్టైల్లో చెర‌గ‌ని ముద్ర వేస్తూ వ‌స్తోన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యి అక్క‌డ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

పాల్వాయి మృతి తెలంగాణ రాజ‌కీయాల్లో కొంద‌రికి రిలీఫ్ అయితే మరికొంద‌రికి మైన‌స్‌గా మార‌బోతోంద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. పాల్వాయికి ముక్కుసూటి నేత‌గా పేరుంది. తొలి తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనే ఆయ‌న ప్ర‌త్యేక తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఇక తాజా తెలంగాణ రాజ‌కీయాల్లో సైతం ఆయ‌న త‌న‌దైన ముద్ర వేస్తున్నారు.

ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని తొల‌గించాల‌ని న‌ల్గొండ జిల్లాకే చెందిన కోమ‌టిరెడ్డి సోద‌రులు తెర‌వెన‌క తెర ముందు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే పాల్వాయి మాత్రం ఉత్త‌మ్‌ను మార్చ‌వ‌ద్ద‌ని ఏకంగా పార్టీ అధిష్టానానికే చెప్పారు. ఉత్త‌మ్‌కు ఆయ‌న అన్ని విధాలా స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ పేరు చెపితేనే పాల్వాయి అంతెత్తున ఎగిరిప‌డ‌తారు.

పాల్వాయి మాటకు అధిష్టానం సైతం న‌మ్మ‌కం ఉంచుతోంది. ఆయ‌న కాంగ్రెస్‌లో ఈ నాటి నాయ‌కుడు కాదు. నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 1967లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీ గా, రాజసభ సభ్యుడిగా పనిచేశారు. అధిష్టానం వ‌ద్ద అంత బ‌ల‌మైన ప‌లుకుబ‌డి ఉన్న ఆయ‌న మృతి ఉత్త‌మ్‌కు రైట్ హ్యాండ్‌ను కోల్పోయిన‌ట్టు ఉంటే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు పెద్ద రిలీఫ్ లాగా ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.