టీఆర్ఎస్‌లో ముగ్గురు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎంపీలు

రాజ‌కీయ పార్టీ అన్నాక ప్ర‌జాప్ర‌తినిధులు నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబ‌ట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఇలాంటి ఆధిప‌త్య పోరే న‌డుస్తోంది. మంత్రులు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ కోల్డ్‌వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎంపీల మ‌ధ్య జ‌రుగుతోంది.

పాల‌మూరు జిల్లాలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిప‌త్యం చెలాయిస్తుండ‌డం ఎంపీ జితేంద‌ర్‌రెడ్డికి న‌చ్చ‌డం లేదు. దీంతో ఆయ‌న మంత్రి జూప‌ల్లిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. జూప‌ల్లి దూకుడు దెబ్బ‌తో ఒక్క జితేంద‌ర్‌రెడ్డి మాత్ర‌మే కాదు జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు సైతం ప్ర‌యారిటీ లేకుండా పోయారు. ఇక తాజాగా అమ‌రుల స్థాపావిష్క‌ర‌ణ సాక్షిగా మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. అమ‌రుల స్థూపంలో జిల్లాకు చెందిన అమ‌రుల పేర్లు లేక‌పోవ‌డం వెన‌క మంత్రి జూప‌ల్లి బాధ్య‌తా రాహిత్య‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు.

ఇక జూప‌ల్లి ఒంటిద్దు పోక‌డ‌ల‌పై ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి జిల్లాకు చెందిన కొంద‌రి ఎమ్మెల్యేల‌తో క‌లిసి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డికి కూడా పొస‌గ‌డం లేదు. రంగారెడ్డి జిల్లాకు మంత్రిగా ఉన్న మ‌హేంద‌ర్‌రెడ్డి చేవెళ్ల జిల్లాపై కూడా ఆధిప‌త్యం చెలాయిస్తుండ‌డం కొండాకు న‌చ్చ‌డం లేదు. ఆయ‌న సైతం ఈ వ్య‌వ‌హారంపై సీఎం వ‌ద్ద తేల్చుకునే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

ఇక ఈ స్థాయిలో కాక‌పోయినా ఖ‌మ్మం జిల్లాలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మ‌ధ్య ఇంటర్న‌ల్‌గా కోల్డ్‌వార్ న‌డుస్తోంది. వీరిద్ద‌రివి ముందు నుంచి భిన్న రాజ‌కీయ నేప‌థ్యాలు. ఆ త‌ర్వాత వీరు టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు. వీరి చేతులు క‌లిసినా మ‌న‌స్సులు మాత్రం క‌ల‌వ‌డం లేదు. రాజ‌కీయంగా ఆధిప‌త్యం కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నా తుమ్మ‌ల హ‌వానే కంటిన్యూ అవుతోంది. ఏదేమైనా తెలంగాణ‌లో ఈ ముగ్గురు ఎంపీలు వర్సెస్ మంత్రులే కాదు మిగిలిన ఎంపీల‌కు కూడా కొంద‌రు మంత్రుల‌తోనే లేదా ఎమ్మెల్యేల‌తోనే పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది.