ఏపీలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనన్న విషయాన్ని ఇప్పటికే సూచనాభిప్రాయంగా వెల్లడించేశారు. వయోభారం రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనుకుంటోన్న మురళీమోహన్ తాను తప్పుకుని ఆ స్థానంలో తన కోడులు రూపాదేవిని అక్కడ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు.
మురళీమోహన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ పేరును సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బలమైన రాజకీయ ఫ్యామిలీకి చెందిన ఆయన ఇటీవల చాలా తక్కువ టైంలో యంగ్ పారిశ్రామికవేత్తగా దూసుకుపోతున్నారు.
ఇంద్రకుమార్ తాత అల్లూరి బాపినీడు పశ్చిమగోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్. నాడు ఈస్ట్, వెస్ట్ రాజకీయాలను బాపినీడు తన కనుసైగలతో శాసించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వర్గానికి బాపినీడు, మరో వర్గానికి మూర్తిరాజు నాయకత్వం వహించేవారు. ఇంద్రకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట.
సామాజికపరంగాను, ఆర్థిక పరంగాను ఇంద్రకుమార్ అయితేనే రాజమండ్రి ఎంపీ సీటుకు సరైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. బలమైన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, ఆయన కుటుంబానికి ఉన్న మంచి పేరు కూడా ఇంద్రకుమార్‌కు ప్లస్ కానున్నాయి. ఇక మురళీమోహన్ తప్పుకుని తన కోడలు రూపాదేవికి ఎంపీ సీటు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు మాత్రం ఈ సారి మురళీమోహన్‌కు గాని, ఆయన ఫ్యామిలీకి గాని సీటు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.