ఆ ఇద్ద‌రు ఏపీ మంత్రుల మౌనం వెన‌క‌

పాలిటిక్స్‌లో హేమాహేమీలైన నేత‌లు మౌనంగా ఉంటే.. దాన‌ర్థం ఏమై ఉంటుంది? ఎంతో చ‌లాకీగా ఉండాల్సిన నేత‌లు చేతులు ముడుచుకుని కూర్చుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండింటికీ స‌మాధానం కావాలంటే అర్జంటుగా విశాఖ పాలిటిక్స్‌లోకి ఎంట‌రైపోవాల్సిందే. ఈ జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు గ‌త కొన్నాళ్లుగా మూతి బిగించుకుని కూర్చోవ‌డ‌మే కాకుండా, చేతులు క‌ట్టేసుకుని మౌనంగా ఉన్నార‌ట‌. త‌మ త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై క‌నీసం స‌మీక్ష‌లు కూడా చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు కాబ‌ట్టి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని భావించిన అధికార ప‌క్ష ఎమ్మెల్యేల‌కు అడుగ‌డుగునా నిరాశే ఎదుర‌వుతోంద‌ట‌! ఈ ఇద్ద‌రు మంత్రులు క‌నీసం ఆ ఎమ్మెల్యేల‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా మానేశార‌ట‌. మ‌రి అంత‌గా ఆ మంత్రులు మౌనం ఎందుకు పాటించాల్సి వ‌స్తోంది? ఇప్పుడు ఇదే మిలియ‌న్ డల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌న అంటున్నారు విశ్లేష‌కులు!

ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, అట‌వీ శాఖ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడులు పొలిటిక‌ల్‌గా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌వాళ్లే. ఎన్నో ఏళ్లుగా అయ్య‌న్న టీడీపీలో ఉంటే, ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాడంతో తొలుత హ‌స్తం పార్టీలో చేరి, 2014 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన గంటా సైకిలెక్కి.. మినిస్ట‌ర్ సీటు కొట్టేశారు. విశాఖలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గానికి గంటా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇక‌, అయ్య‌న్న విష‌యానికి వ‌స్తే..  ఎన్‌టీఆర్ పిలుపుతో తెలుగు దేశంలో చేరిన ఈయ‌న అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. గతంలో అనేక ప‌ద‌వులు నిర్వ‌హించారు. న‌ర్సీప‌ట్నం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

అయితే, ఈ ఇద్ద‌రు మంత్రులు గ‌త కొన్నాళ్లుగా త‌మ సొంత జిల్లాపై శీత‌క‌న్నేశార‌నే టాక్ వ‌స్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధి కోసం త‌ప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా విశాఖ వంటి అతిపెద్ద పారిశ్రామిక న‌గ‌రం డెవ‌ల‌ప్ అయితే,  రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని బాబు యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ప‌లు స‌దస్సుల‌ను కూడా ఆయ‌న నిర్వ‌హిస్తున్నారు. వారానికి ఒక సారైనా విశాఖ ప‌రిస్థితులు , అభివృద్ధిపై చంద్ర‌బాబు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కానీ, ఇదే జిల్లాకు చెందిన అయ్య‌న్న‌, గంటాలు మాత్రం అస్స‌లు త‌మ‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌.

ఆంధ్ర విశ్వవిద్యాలయం తప్ప తన సొంతమైన విద్యా శాఖ పరంగా జిల్లాకు అందాల్సిన నిధులు, జరగాల్సిన పనులపై మంత్రి గంటా ఇప్పటివరకు సమీక్షించిన దాఖలాలు లేవ‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యేల స‌మ‌స్య‌ల‌పైనా గంటా దృష్టి సారించ‌డం లేద‌ట‌. పోనీ త‌న శాఖ‌కు సంబంధించిన డీఈఓ, ఆర్‌వీఎం ప్రాజెక్ట్‌ డైరెక్టర్లతో కలిసి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేద‌ని తెలుస్తోంది. అయ్య‌న్న విష‌య‌మూ దీనికి భిన్నంగా ఏమీలేద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సీప‌ట్నంపైనే చింత‌కాయ‌ల ప్రేమ కురిపిస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ప్రపంచబ్యాంకు, నాబార్డు, ఎనఆర్‌ఈజీఎ్‌స తదితర పథకాల నుంచి నిధులు వస్తే…నర్సీపట్నం నియోజకవర్గానికే ఎక్కువ కేటాయించుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఈయ‌న కూడా స్థానిక ఎమ్మెల్యేల‌తో ట‌చ్‌లో ఉండ‌డం లేద‌ట‌. ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు చెంత‌కు చేరింది. దీనిపై త్వ‌ర‌లోనే ఆయ‌న చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే, మంత్రులు ఇద్ద‌రూ.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ ప‌ద‌వుల‌కు ఎస‌రు పొంచి ఉంద‌ని గుర్తించే అస‌లు ప‌నిచేయ‌డం మానేశారా? అనే కోణంలో ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.