వైసీపీలో ఏ మంత్రికి టిక్కెట్ లేదు.. ఇప్పుడిదే హాట్ టాపిక్‌…!

ఔను.. వైసీపీలో మంత్రుల విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రు మంత్రుల‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల కింద‌ట గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామికి సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ లేద‌ని ప్ర‌క‌టించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి. దీనిని నారాయ‌ణ స్వామి కూడా ఖండించ‌లేదు. అంటే.. నిజ‌మ‌నే అనుకోవాలి.

స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు.. రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌, ఓ సామాజిక వ‌ర్గం నుంచి వ‌స్తున్న ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇక్క‌డ మార్పు త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చారు. అయితే, నారాయ‌ణ స్వామిని నొప్పించ‌కుండా.. ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్ ప‌ద‌విని ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. మ‌రో ఇద్ద‌రు మంత్రుల వ్య‌వ‌హారం కూడా.. పార్టీలోచ‌ర్చ‌కు దారితీసింది. మ‌రి వారి ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఆ ఇద్ద‌రు మంత్రులు కూడా అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. నిరంతరం ఏదో ఒక ప‌త్రికలో వారి అవినీతి అక్ర‌మాల‌పై క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని జ‌గ‌న్ ఏం చేయ‌నున్నారు? ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. వారే క‌ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి జ‌యరాం. అనంత‌పురం జిల్లాకు చెందిన క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే క‌మ్‌.. మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌. ఈ ఇద్ద‌రిపైనా.. అనేక అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. పార్టీకి అందిన స‌మాచారం ప్ర‌కారం కూడా.. వారి గ్రాఫ్ ఏమీ బాగోలేద‌నే వాద‌న కూడా వినిపించింది. ఈ క్ర‌మంలో వారిని త‌ప్పిస్తే.. త‌మ‌కు సీటు ద‌క్కుతుంద‌ని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇద్ద‌రే సి చొప్పున నాయ‌కులు తెర‌చాటు మంత్రాంగాలు కూడా చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే.. వీరి విష‌యంలో పార్టీ కూడా ఆలోచ‌న చేస్తోంద‌ని.. ఇప్ప‌టికిప్పుడు వారికి టికెట్ లేద‌ని సంకేతాలు పంపితే.. సామాజిక వ‌ర్గాల ప‌రంగా ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌నే ఉద్దేశం ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. టికెట్ ద‌క్క‌నివారి జాబితాలో ఈ ఇద్ద‌రు కూడా ఉన్నార‌ని గ‌ట్టిగానే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.