మేక‌పాటి కుటుంబంలో అప్పుడే టిక్కెట్ చిచ్చు…!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా మేక‌పాటి కుటుంబం జిల్లాలో ఆనం, న‌ల్ల‌పురెడ్డి, సోమిరెడ్డి, నేదురుమిల్లి ఇలా ఎన్ని బ‌ల‌మైన కుటుంబాలు ఉన్నా కూడా త‌న ఆధిప‌త్యాన్ని నిలుపుకుంటూ వ‌స్తోంది. అలాంటి బ‌ల‌మైన ఫ్యామిలీలో ఇప్పుడు టిక్కెట్ చిచ్చు రాజుకున్న‌ట్టు తెలుస్తోంది. మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి నెల్లూరు, ఒంగోలు, న‌రసారావుపేట నుంచి ప‌లుమార్లు ఎంపీగా గెలిచారు. ఇక ఆయ‌న కుటుంబానికి ఉద‌య‌గిరి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి ప‌ట్టు ఉంది.

మేక‌పాటి ఎంపీగా వెళ్లిన‌ప్పుడు త‌న కంచుకోట అయిన ఉద‌య‌గిరిలో త‌మ్ముడు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని నిల‌బెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత కుమారుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయనను మరో బలమైన స్థానం ఆత్మకూరులో నిలబెట్టి ఎమ్మెల్యేను చేశారు. రెండు సార్లు గెలిచిన గౌతం కూడా ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న భార్య శ్రీ కీర్తియో లేదా మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మ‌రో కుమారుడో పోటీ చేస్తారు.

ఆత్మ‌కూరు టిక్కెట్‌తో ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఉద‌య‌గిరి సీటు 2024లో ఎవ‌రికి ఇస్తారు ఇదే.. పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఉద‌య‌గిరి సీటు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బ‌దులుగా త‌న మ‌రో కుమారుడికి ఇవ్వాల‌ని రాజ‌మోహ‌న్ రెడ్డి జ‌గ‌న్‌ను కోరారు. అయితే జ‌గ‌న్ మాత్రం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయ‌న వివాదాల్లో ఉన్నారు. ఆయ‌న రెండో భార్య అన‌ధికారిక ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పేస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ కేడ‌ర్ కూడా రాజ‌మోహ‌న్ రెడ్డికే స‌పోర్ట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి కాకుండా రాజ‌మోహ‌న్ రెడ్డి మ‌రో కుమారుడికి ఇక్క‌డ సీటు ఇప్పించేలా తెర‌వెన‌క పావులు క‌దులుతున్నాయ‌ట‌. లోకల్ వైసీపీ నేతలు కూడా సీనియర్ మేకపాటికే మద్దతుగా ఉంటున్నారు. వారంతా సజ్జలను కలిసే ఆలోచన చేస్తున్నారు. మ‌రి ఈ ముస‌లం ఎలా మారుతుందో ? చూడాలి.