అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇండియ‌న్ల విజ‌యం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు అమెరికా ఎన్నిక‌ల గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రపంచమంతా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో తొలి నుంచి వివాస్ప‌ద వార్త‌లు చేస్తూ వ‌స్తోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌

మ్యాజిక్ మార్క్‌కు చేరువై అంద‌రికి షాక్ ఇచ్చారు.

మొత్తం 538 ఓట్లున్న ఎలెక్టోరల్‌ కాలేజీలో ట్రంప్‌ 244 ఓట్లు సాధించారు. కాగా విజయం ఖాయమని భావించిన డెమొక్రటిక్ పార్టీ  అభ్యర్థి హిల్లరీ 209 ఓట్లతో వెనుకబడ్డారు. మెజార్టీ సాధించాలంటే 270 ఓట్లు అవసరం. ఈ లెక్క‌న చూస్తే ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప ట్రంప్ విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌న ఇండియ‌న్లు కూడా విజ‌యం సాధించారు.

భారతీయ అమెరికన్ మహిళ, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రికార్డు క్రియేట్ చేశారు. ఆమె తొలి ఇండియన్‌-అమెరికన్ సెనేటర్‌గా ఎన్నికైన ఘనత దక్కించుకున్నారు. డెమోక్రాట్స్ త‌ర‌పున పోటీ ప‌డ్డ ఆమె త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన లోరెట్టా శాన్‌చెజ్ పై విజయం సాధించారు.

క‌మ‌ల త‌ల్లి 1960లో చెన్నై నుంచి అమెరికాకు వెళ్లి అక్క‌డే సెటిల్ అయ్యారు. 51 ఏళ్ల క‌మ‌ల అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ మద్దతుతో బరిలోకి దిగారు. ఇక ప్ర‌తినిధుల స‌భ‌నుంచి పోటీ చేసిన మ‌రో ఇండియ‌న్ – అమెరిక‌న్ అయిన రాజా కృష్ణమూర్తి సైతం విజ‌యం సాధించారు.

ఇలినాయి నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. కృష్ణమూర్తికి ప్రవాస తెలుగు సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే ప్ర‌తినిధుల స‌భ‌కే పోటీ ప‌డిన మ‌రో ఇండియ‌న్ – అమెరిక‌న్ అయిన పీటర్‌ జాకబ్ మాత్రం ఓట‌మి పాల‌య్యారు. ఆయ‌న రిపబ్లికన్‌ అభ్యర్థి లియోనార్డ్‌ లాన్స్‌ చేతిలో 15 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు.