టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ మైండ్‌గేమ్!

టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ముమ్మాటికి నష్టమే..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిక ఉండదు..అదే కలిసి లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుని చెడగొట్టేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది.

ఇప్పటికే దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జగన్ తో సహ వైసీపీ నేతలు..టి‌డి‌పి, జనసేనలకు సవాల్ చేస్తున్న విషయం తెలిసిందే. అంటే ఆ సవాల్‌కు రెచ్చిపోయి రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే లబ్ది పొందాలనేది వైసీపీ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు..టి‌డి‌పి, జనసేనలు పట్టించుకోవడం లేదు. అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వైసీపీకి ఎందుకని అంటున్నారు. అలాంటప్పుడు వైసీపీకి దమ్ముంటే అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలని టి‌డి‌పి రివర్స్ లో సవాల్ చేస్తుంది. మొత్తానికి వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది.

దీంతో వైసీపీ మరో విధంగా ముందుకొస్తుంది..ఎప్పటిలాగానే ఫేక్ పోస్టులతో రంగంలోకి దిగింది. అది ఏంటంటే..టి‌డి‌పి, జనసేన నేతల పేరిట తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామనే విధంగా స్టేట్‌మెంట్లు వచ్చేలా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరిట పోస్టు వదిలారు..తమకు జనసేనతో పొత్తు అవసరం లేదని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని అచ్చెన్న చెప్పినట్లు పోస్టు క్రియేట్ చేశారు.

దానికి కౌంటరుగా నాగబాబు పేరిట..పోస్టు పెట్టారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని పెట్టారు. ఇక ఈ పోస్టులని చూసి టి‌డి‌పి, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు వస్తాయనేది వైసీపీ ప్లాన్. కానీ వెంటనే రెండు పార్టీలు ఆ పోస్టులని ఖండించి..క్లారిటీ ఇచ్చాయి. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ ఎవరు నమ్మవద్దని వివరణ ఇచ్చారు. మొత్తానికి వైసీపీ మైండ్ గేమ్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు.