గుడివాడకు బాబు..కొడాలికి రిస్క్ పెరుగుతుందా?

బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అంటూ సరికొత్త కార్యక్రమాలతో టీడీపీ ప్రజల్లోకి వెళుతుంది..అభివృద్ధి లేకుండా అరాచక పాలన చేస్తూ..ప్రజలపై పన్నుల భారం పెంచి, ప్రజలని జగన్ ప్రభుత్వం నిండా ముంచేసిందని టీడీపీ పోరాటాలు చేస్తుంది. ఇప్పటికే బాదుడేబాదుడు పేరిట టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళుతున్నారు. అటు చంద్రబాబు సైతం రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలోకి వెళుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు.

బాబు పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుంది. అసలు వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలులో బాబుకు ఊహించని స్థాయిలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీంతో టీడీపీకి మైలేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు ఇదేం ఖర్మ కార్యక్రమం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంట్రీ ఇచ్చారు..మూడు రోజులపాటు కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

ఇక త్వరలోనే మరోసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తారని తెలిసింది. మొన్న పర్యటనలో నందిగామ, జగ్గయ్యపేట వెళ్లారు. ఇప్పుడు గుడివాడ, బందరు నియోజకవర్గాల్లో పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా బందరులో కార్యకర్తలతో కొల్లు రవీంద్ర సమావేశమై..బాబు పర్యటనని విజయవంతం చేయడానికి చర్చించారు. చంద్రబాబు గుడివాడ, మచిలీపట్నంలలో పర్యటిస్తారని, మచిలీపట్నంలో రాత్రి బస చేస్తారని దీనికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే కార్యకర్తలు విభేదాలు విస్మరించి రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు.

అయితే బాబు..గుడివాడ, బందరు టూర్ దాదాపు ఫిక్స్ అయినట్లే. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో గుడివాడలో మినీ మహానాడు నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో సక్సెస్ చేయడానికి టీడీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. కానీ చివరి నిమిషంలో వర్షాల వల్ల కార్యక్రమం రద్దయింది. దీంతో గుడివాడలో టీడీపీ శ్రేణులు నిరాశపడ్డారు. ఎలాగైనా కొడాలి నానికి చెక్ పెట్టేలా చేయాలని చెప్పి కష్టపడుతున్నారు. ఈ క్రమంలో బాబు గుడివాడ టూర్ ఫిక్స్ అవుతుంది..ఈ టూర్‌ని భారీగా సక్సెస్ చేసి గుడివాడలో టీడీపీ సత్తా ఏంటో తెలియజేయాలని చూస్తున్నారు.