భీమ్లాకు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందే మ‌రో దెబ్బ‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేటర్ల‌లోకి రానుంది.
ఈరోజు హైద‌రాబాద్‌లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌ లో భీమ్లా నాయ‌క్‌ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేసేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌తో పాటు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఈ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథులుగా వ‌స్తున్నారు. సోమ‌వారం జ‌ర‌గాల్సిన ఈ ఫంక్ష‌న్ ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఈ రోజుకు వాయిదా ప‌డింది.

ఇక భీమ్లానాయ‌క్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందే పెద్ద షాక్ త‌గిలింద‌ని చెప్పాలి. పుష్ప ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే గ్రౌండ్‌లో జ‌రిగింది. అనుమ‌తికి మించి పాస్‌లు జారీ చేయ‌డం వ‌ల్ల‌… క్రౌడ్ ఎక్కువ రావ‌డంతో వాళ్ల‌ను అదుపు చేయ‌డం క‌ష్టం అయ్యింది. చాలా మంది అభిమానులు బ‌య‌ట ఉండ‌డంతో పాటు తోపులాట‌లో కొంద‌రు గాయ‌ప‌డాల్సి వ‌చ్చింది.

అయితే భీమ్లానాయ‌క్ విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. పైగా మంత్రి కేటీఆర్ కూడా వ‌స్తున్నారు. అందుకే పాస్‌ల ముద్ర‌ణ బాధ్య‌త అంతా పోలీస్ శాఖ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మొన్న సోమ‌వారం నాటి ఈవెంట్ వ‌ర‌కే చిత్ర యూనిట్ పాస్‌లు ముద్రించి పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు అవి చెల్ల‌వు. ఈ రోజు ఈవెంట్‌కు పోలీస్‌శాఖ ఇచ్చిన పాస్‌ల‌కు మాత్ర‌మే లోప‌ల‌కు అనుమ‌తి ఉంటుంది.

సాధార‌ణంగా 5 వేల పాస్‌లు ఇవ్వాల‌ని అనుకుంటే 10 వేల పాస్‌లు ఇస్తూ ఉంటారు. అయితే ఈ సారి భీమ్లా విష‌యంలో కేవ‌లం 5 వేల పాస్‌లు మాత్ర‌మే ఇస్తున్నార‌ట‌. ఇది అభిమానుల‌కు పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి. ఇక ఈ ఈవెంట్‌కు టీవీ ఛానెల్స్‌కు కూడా అనుమ‌తి లేదు. కేవ‌లం హారిక హాసిని యూట్యూబ్ ద్వారా మాత్ర‌మే లైవ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.