నంద్యాల ఎల‌క్ష‌న్ బ‌డ్జెట్‌ అన్ని కోట్లా!

ఎన్నిక‌లు వస్తే చాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి పార్టీలు సామ‌బేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధార‌ణ ఎన్నిక అయినా, స‌ర్పంచ్ ఎన్నిక అయినా.. ధ‌న ప్ర‌వాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండ‌దు. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి! గెలుపు కోసం అటు అధికార ప‌క్షం, ఇటు ప్రతిప‌క్షం పోటీపోటీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యం లో.. ఈ ఎన్నిక‌ల్లో ఎంత ఖ‌ర్చు ఎంత‌వుతుంద‌నే సందేహం ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో నోట్ల క‌ట్ట‌ల‌కు రెక్క‌లు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా తెలుస్తోంది. సుమారు త‌క్కువ‌లో తక్కువ‌గా ఇక్క‌డ ఇరు పార్టీలు ఖ‌ర్చు చేసే మొత్తం ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ.80కోట్ల నుంచి రూ.100 కోట్లు!!

నంద్యాల ఉప ఎన్నిక‌కు ఇంకా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌క‌పోయినా.. ఇప్ప‌టినుంచే టీడీపీ,వైసీపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిపోయాయి. నంద్యాల ఓట‌ర్ల‌పై జిల్లా నేత‌ల నుంచి సీఎం వ‌ర‌కూ హామీల జ‌ల్లులు కురిపిస్తున్నారు. చేతికి ఎముకే లేన‌ట్టుగా టీడీపీ స‌ర్కారు వివిధ అభివృద్ధి ప‌థ‌కాల పేరుతో నిధులు గుమ్మ‌రిస్తున్నారు. అధికార పార్టీ నాయ‌కుల పోటీని త‌ట్టుకుని వైసీపీ కూడా అందుకు త‌గ్గ‌ట్టే హామీలు గుప్పిస్తోంది! అయితే వీటన్నింటికీ మించి.. ఈ ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం.. జ‌ర‌గ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది! ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌మేయం ఉండ‌కూడ‌దని ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు చెప్పినా.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి ఇవి ఎక్క‌డా అమ‌లుకావ‌డంలేదు.

నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో జ‌రుగుతున్న అధికారిక ఖ‌ర్చుల గురించి చెప్పాలంటే.. దాదాపు రూ. 500 కోట్ల వ‌ర‌కూ నియోజ‌కవ‌ర్గ అభివృద్ధికి టీడీపీ కేటాయించిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇక‌, అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. ఓట్ మేనేజ్ మెంటు కోసం అధికార పార్టీ రూ. 40 కోట్లు వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్ట‌బోతోందంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. గ్రామస్థాయి నుంచీ ఓ స‌ర్వే చేయించుకుని, దాని ఆధారంగా ప్ర‌చారానికి ఎంత ఖ‌ర్చు పెట్టాలి, ఓట‌ర్ల‌ కోసం ఎంత ఖ‌ర్చు చేయ్యాల‌నే అనే ప్లానింగ్ తో ఉన్న‌ట్టు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇక‌, ప్ర‌తిప‌క్షం కూడా ఏమాత్రం త‌గ్గ‌డం లేదట‌. నిధుల విష‌యంలో అధికార పార్టీలో పోటీప‌డే స్థాయిలో లేద‌ట‌.

నంద్యాల ఎన్నిక‌ల ఖ‌ర్చు విష‌యంలో శిల్పా మోహ‌న్ రెడ్డితో వైసీపీ నేత‌లు మొద‌టే ఒక డీల్ కుదుర్చుకున్న‌ట్టు తెలుస్తోంది. దీని ప్ర‌కారం.. ఎన్నిక‌ల ఖ‌ర్చంతా తానే పెట్టుకుంటాన‌నీ, వైసీపీ నుంచి టిక్కెట్టు ఇస్తే చాల‌నేది దీని సారాంశ‌మ‌ట‌. అధికార పార్టీతో పోటీ ప‌డే స్థాయిలో నిధుల స‌మీక‌ర‌ణ‌కు శిల్పా కూడా కాస్త త‌ట‌ప‌టాయిస్తున్న‌ట్టుగానే తెలుస్తోంది. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక‌కు వైకాపా పెట్టుకున్న బ‌డ్జెట్ రూ. 30 కోట్లు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనికి మరో ఐదో ప‌దో ఎక్కువ అవడం ఖాయం! ఈ నేప‌థ్యంలో అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నికగా నంద్యాల ఉప ఎన్నిక నిలిచిపోతుంద‌న‌డంలో సందేహం లేదు!!