వరల్డ్ కప్ కు ముందే రోహిత్ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు.. అవేంటంటే..?

2023 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రెండు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఇందులో ఒకటి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వరల్డ్ కప్ సెంచరీల రికార్డ్… రెండోది వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ రికార్డ్‌. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ 6 శతకాలు బాదగా రోహిత్ కూడా సచిన్‌తో సమానంగా తన ఖాతాలో 6 సెంచరీలు కలిగి ఉన్నాడు. ప్రపంచ కప్ క్రికెట్లో రోహిత్ కేవలం 17 ఇన్నింగ్స్ లోనే 6 శతకాలు, 3 అర్థ శతకాలు చేశాడు. ఇందులో రోహిత్ ఒక 2019 ప్రపంచ కప్ లోనే 5 సెంచరీలు చేయడం విశేషం.

త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో టీమిండియా 10కి పైగా మ్యాచులు ఆడే అవకాశం ఉండడంతో రోహిత్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక వరల్డ్ కప్ సెంచరీల రికార్డును ఈజీగా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరోవైపు రోహిత్ వరల్డ్ కప్ సెకెండ్‌ ఇన్నింగ్స్ లో 22 పరుగులు చేస్తే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కును చేరిన ఆటగాడుగా రికార్డ్ నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 17 ఇన్నింగ్స్ లో 978 పరుగులు ఉన్నాయి. ఇదిలా ఉంటే 2023 ప్రపంచ కప్ భారత్ వేదికగా అక్టోబర్ ఐదు నుంచి ప్రారంభం కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, గత ఆడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్ తో ఈ వరల్డ్ కప్ లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు చెన్నె వేదిక కానుంది. ఈనెల 14న టీమ్ ఇండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఆహారాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.