దివిసీమలో టీడీపీ-జనసేన పోరు..సీటుపై ట్విస్ట్.!

టీడీపీ-జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఇంకా సెట్ కాలేదు..కానీ ఇప్పటినుంచే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఏ ఏ సీట్లలో ఓట్లు చీల్చి గెలుపోటములని తారుమారు చేశారో.ఆ సీట్లని ఇప్పుడు జనసేన కావాలని అనుకుంటుంది. పొత్తులో భాగంగా ఆ సీట్లు తీసుకోవాలని చూస్తుంది.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మూడు సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. కృష్ణాలో 7 సీట్లు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేన మూడు సీట్లలో గెలుపోటములని తారుమారు చేసింది. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ సీట్లలో ఓట్లు చీల్చి టి‌డి‌పిని ఓడించి, వైసీపీని గెలిపించింది. మచిలీపట్నంలో 18 వేల ఓట్లు, పెడనలో 25 వేల ఓట్లు, అవనిగడ్డలో 28 వేల ఓట్లు వచ్చాయి. ఈ మూడు సీట్లలో టి‌డి‌పికి జనసేన సపోర్ట్ కావాలి..లేదంటే గెలుపు కష్టం.

అందుకే ఈ మూడు సీట్లపై జనసేన పట్టుబడుతుంది. కానీ మూడు సీట్లలో టి‌డి‌పికి బలమైన నాయకులు ఉన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈయనని కాదని జనసేనకు సీటు ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక పెడనలో దివంగత కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ ఉన్నారు. అయితే ఈ సీటు కోసం టి‌డి‌పిలో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇదే సీటు జనసేన అడుగుతుంది.

ఇక అవనిగడ్డలో సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. మరి ఆయన్ని పక్కన పెట్టగలరా? అనేది చూడాలి. ఎలాగో పవన్‌తో మండలికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా జనసేనకు ఇక్కడే ఓట్లు ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఈ సీటు జనసేనకు వదిలే ఛాన్స్ ఉంది. చూడాలి మరి చివరికి జనసేనకు ఏ సీటు దక్కుతుందో.