రాఘవ లారెన్స్ గొప్ప మ‌న‌సుకు హ్యాట్సాఫ్‌.. మ‌రీ ఇంత మంచోడివి ఏంటి సామీ!

రాఘవ లారెన్స్ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఈ విష‌యం ఎన్నో సార్లు రుజువు అయింది. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా విజయ పరంపర కొన‌సాగిస్తున్న లారెన్స్‌.. తాను కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత మొత్తానికి సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తుంటారు.

ఇప్ప‌టికే ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో భాగం అయ్యాడు. అలాగే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు తన వంతు సాయం చేశాడు. 140 మంది చిన్నారులకు ఆయన హార్ట్ సర్జరీ చేయించారు. అనాధ, పేద విద్యార్థులను చదివిస్తున్నారు. తాజాగా మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు.

తాజాగా 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. త‌న ట్రస్ట్ తరపున ఈ పిల్లలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు అందించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. `రుద్రన్` సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫోటోను కూడా లారెన్స్ పంచుకున్నాడు. దీంతో ఆయ‌న గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మ‌రీ ఇంత మంచోడివి ఏంటి సామీ అంటూ లారెన్స్ పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.