తిరువూరులో అదిరిపోయే ట్విస్ట్…మళ్ళీ కొత్త అభ్యర్ధి?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వినే ఉంటారు. అలాగే కార్యకర్తల బలం, బలమైన పునాదులు ఉన్నా సరే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. 1983 నుంచి 1999 వరకు మంచి విజయాలే సాధించింది. ఆ తర్వాత నుంచి ఒక్కసారి కూడా పార్టీ గెలవలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో అభ్యర్ధిని కూడా మార్చారు. నల్లగట్ల స్వామిదాస్‌ని మార్చి మాజీ మంత్రి కే‌ఎస్ జవహర్‌ని నిలబెట్టారు.

అయినా సరే టీడీపీకి దరిద్రం పోలేదు. మరొకసారి ఓటమి పాలైంది. సరే జవహర్ గోదావరి జిల్లాకు వెళ్లిపోవడంతో..ఎన్‌ఆర్‌ఐ అయిన దేవదత్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే దేవదత్ డబ్బులు బాగానే ఖర్చు పెడుతూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాలని చేస్తున్నారు. కానీ ఓ వ్యూహం అంటూ లేకుండా ముందుకెళుతున్నారు. ఏదో మూస పద్ధతిలో రాజకీయం నడుపుతున్నారు తప్ప..వైసీపీకి ఎలా చెక్ పెట్టాలనే దిశగా పనిచేయడం లేదు.

అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధికి పెద్దగా పాజిటివ్ లేకపోయినా సరే దేవదత్ బలపడటం లేదు. పైగా నియోజకవర్గంలో ఓ వర్గం..దేవదత్‌ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అది ఎస్సీ సీటు కావడంతో..మళ్ళీ ఎస్సీ నేత గెలిస్తే ఎక్కడ తమ పెత్తనం పోతుందో అని చెప్పి ఓ వర్గం వారు సైలెంట్‌గా దెబ్బవేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల తిరువూరులో టీడీపీ ఇంకా బాగోలేదు.

దీంతో మరొకసారి తిరువూరులో అభ్యర్ధిని మారుస్తారని ప్రచారం మొదలైంది. దేవదత్‌ని పక్కన పెట్టి..కొత్త అభ్యర్ధిని తీసుకొస్తారని తెలిసింది. పామర్రుకు చెందిన ఉప్పులేటి కల్పనని తిరువూరు బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. అదే సమయంలో టీడీపీ నేత వాసం మునయ్యని అభ్యర్ధిగా దించే విషయం ఆలోచిస్తున్నారని సమాచారం. ఏదేమైనా గాని మళ్ళీ తిరువూరులో కొత్త అభ్యర్ధి వచ్చేలా ఉన్నారు. ఇక గెలుపు దక్కుతుందో లేదో చూడాలి.