ఏపీలో మ‌ళ్లీ వైసీపీని గెలిపించేది ఆ ఒక్క‌టేనా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీని ఎవ‌రు న‌డిపిస్తారు? వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌ను ప‌క్క‌న పెట్టిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? ఎలా పుంజుకుంటుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు సీనియ‌ర్లు.. చెబుతున్న మాట‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అని! ఎందుకంటే.. ఆయ‌న ఇమేజ్ ఇప్పుడు రాష్ట్రంలో రెప‌రెప‌లాడుతోంది. ఎక్క‌డ విన్నా.. జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణే క‌నిపిస్తోంది.. వినిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ప‌ట్టు జార‌కుండా.. కేవ‌లం పార్టీ నేత‌ల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా.. వ్య‌వ‌హ‌రించాల‌ని సూచిస్తున్నారు.

తాజ‌గా వైసీపీ ప‌క్ష నాయ‌కుల‌తో జ‌గ‌న్ భేటీ అయి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించాల్సింది మీరేన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఇది సాధ్యం కాద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. ఎందుకంటే.. దాదాపు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కొత్త‌వారేన‌ని.. గ‌తంలో జ‌గ‌నే వారిని తీసుకువ‌చ్చార‌ని.. ఇప్పుడు ఇలాంటి వారిపై భారం పెట్ట‌డం వ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం ల‌భించే అవ‌కాశం త‌క్కువ‌ని.. చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కాడిప‌డేయొద్ద‌ని సూచిస్తున్నారు.

జ‌గ‌న్‌పై జ‌నాల‌కు ఒక భ‌రోసా ఉంది. కొన్ని వ‌ర్గాల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్త‌వ‌మే. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ స‌మ‌యంలో నేనుకాదు.. మీరే పార్టిని న‌డిపించాల‌ని.. ఆయ‌న చెప్ప‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లో భ‌రోసాను త‌గ్గించ‌డం అవుతుంది. కాబ‌ట్టి.. జ‌గ‌న్ త‌న వ్యూహాల‌ను మ‌రింత పెంచేలా కృషి చేయాలి త‌ప్ప‌.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని.. ఓ సీనియ‌ర్ నేత‌.. గుంటూరుకు చెందిన నాయ‌కుడు.. వ్యాఖ్యానించారు.

ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు ? ఎవ‌రు ఓడిపోతారు.. అనేది ప‌క్క‌న పెడితే.. ముందు ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన పార్టీగా ఉన్న ఇమేజ్‌ను జ‌గ‌న్ కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. అధినాయకత్వం.. కొన్ని ఈక్వేష‌న్లు వేసుకుని ఉండొచ్చు. కానీ, అవే అమ‌లు చేయాలంటే క‌ష్టం. అలా కాకుండా.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవాలి. అప్పుడే విజ‌యం సాధిస్తాం. లేక‌పోతే.. కేవ‌లం నాయ‌కుల భుజాల‌పై తుపాకులు పెట్టి పేలిస్తే. మొత్తానికే న‌ష్టం. అప్పుడు అదుపు కూడా త‌ప్పే ప్ర‌మాదం ఉంటుంద‌ని వారు సూచిస్తున్నారు.