రామచంద్ర కొత్త పార్టీ..ఎవరి కోసం? వెనుక ఎవరు ఉన్నారు?  

ఏపీలో మరో కొత్త పార్టీ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి..ఆ సభ సాక్షిగా  భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కడమే టార్గెట్ గా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈయన కొత్తగా పార్టీ ఎందుకు పెట్టారు. పార్టీ సక్సెస్ అవుతుందా? అసలు దీని వెనుక ఎవరు ఉన్నారనే చర్చ నడుస్తుంది.

పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్..గత ఎన్నికల్లో జనసేన తరుపున పుంగనూరులో 16 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. అయితే తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఆయన ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులు చేసాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ దాడులపై రామచంద్ర కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే పెద్ద పెద్ద నేతలకే హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం..కానీ ఈయనకు దక్కింది. అలాగే వై కేటగిరీ సెక్యూరిటీ కూడా లభించింది.

అక్కడ నుంచి ఆయన..వైసీపీ టార్గెట్ గానే ముందుకెళుతున్నారు. అయితే జనసేనలోనే కంటిన్యూ అవ్వడం గాని, లేదా బి‌జే‌పి చేరడం గాని చేయలేదు. అటు టి‌డి‌పి పై కూడా ఈయన విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినంత మాత్రాన అది సక్సెస్ గా నడుస్తుందని చెప్పలేం. ఆయన పుంగనూరులోనే ప్రభావం చూపలేకపోయారు.

ఇక పార్టీ  సక్సెస్ కష్టమే. కాకపోతే ఆయన టార్గెట్ ఏదో ఉంది. అందుకే ఇలా పార్టీ పెట్టారు. అలాగే ఆయన వెనుక ఎవరో బలమైన శక్తి ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రామచంద్ర రాజకీయం ఎలా ఉంటుందో.