కాంగ్రెస్‌లోకి కోదండ రాం..!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మేనంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. తెలంగాణ ఉద్య‌మంలో రాత్రిబ‌వంళ్లు శ్ర‌మించిన ప్రొఫెస‌ర్ కోదండ రాం.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌ ఉద్య‌మానికి ద‌శ దిశ చూపిన వారిలో కోదండ‌రాం ప్ర‌ముఖులు. అయితే, రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం, ఆయ‌న అధికారానికి దూరంగానే ఉండిపోయారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో చేర‌తార‌ని అంద‌రూ భావించినా.. ఆయ‌న మాత్రం ఉద్య‌మ‌కారుడిగానే ఉండిపోయారు. ప్ర‌భుత్వంపై సూటి విమ‌ర్శ‌లు చేయ‌డంతో సీఎం కేసీఆర్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య సంబంధాలు కూడా చెడిపోయాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి మ‌రో మ‌లుపు తిరిగింది. కోదండ‌రాం కాంగ్రెస్ ఏజెంటుగా మారిపోయారని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క స‌మన్ బాంబు పేల్చారు. అంతేకాదు, ప్రొఫెస‌ర్‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం వెనుక పెద్ద వ్యూహం ఉంద‌ని దానిలో భాగంగానే కోదండ రాం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం ప్రొఫెస‌ర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ కోసం సాగిస్తున్న రాజ‌కీయంగా సుమ‌న్ అభివ‌ర్ణించారు. ఉద్య‌మ‌కారుడి ముసుగులో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతూ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత‌ పెంచుతున్నార‌నీ ఇది మంచి ప‌రిణామం కాద‌ని హెచ్చ‌రించారు కూడా.

ఇదే స‌మ‌యంలో కోదండ రాంకి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. వాటిని స‌మాధానం చెప్పాల‌ని కూడా అన్నారు. . జులై 16, 17 తేదీల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కోదండ‌రామ్ భేటీ అయ్యారనీ, ర‌హ‌స్యంగా కొన్ని విష‌యాల‌పై ఆ ఇద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌రిపార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌త్తి వెంక‌ట‌స్వామి, అద్దంకి ద‌యాక‌ర్‌ల‌కు కాంగ్రెస్ టిక్కెట్టు ఇప్పించింది ఆయ‌నేన‌నీ.. ఇది నిజ‌మో కాదో ఆయ‌న్నే చెప్ప‌మ‌నండి అంటూ సుమ‌న్ ప్ర‌శ్నించారు. మ‌రి ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే.. సుమ‌న్ చెప్పిందే నిజం అవుతుందేమో..అనే భావ‌న మాత్రం క‌లుగుతోంది. నిజంగానే ప్రొఫెస‌ర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? తెలంగాణ‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటాయా? చూడాలి!!