టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జీవితంలో విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు తండ్రులను కోల్పోవడం ఎలాంటి వేదనలోకి నెట్టేస్తుందో ఊహించడమే కష్టం. ఒకవైపు రీల్ ఫాదర్.. మరోవైపు రియల్ ఫాదర్.. ఇద్దరూ దూరమవడం రవితేజ మనసు తట్టుకోలేని విషాదంలోకి నెట్టింది.ఇప్పుడే కోలుకోవాలని చూస్తున్న సమయంలో, రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు 90. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఆరోగ్యం నిలకడగా ఉన్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.
ఇక ఇది రవితేజ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. ఫార్మసిస్ట్ గా జీవితం గడిపిన రాజగోపాల్ గారు తన ముగ్గురు కుమారులు రవితేజ, రఘు, భరత్‌లకు మంచి మార్గదర్శిగా నిలిచారు.ఇక రెండో వేదన సంగతి చెప్పాలంటే – రవితేజ నటజీవితంలో తండ్రి పాత్రల్లో విరాజిల్లిన కోట శ్రీనివాసరావు గారు రెండు రోజుల క్రితమే పరలోకవాసి అయ్యారు. ముఖ్యంగా ‘ఇడియట్’ సినిమాలో కోట-రవితేజల తండ్రి-కొడుకు బంధం, వారి మధ్య అభినయం.. నిజజీవితానికీ దగ్గరగా ఉండడంతో ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఆ సినిమాలోని ప్రేమ, అర్ధం, బంధం – అన్నీ కూడా నిజమైన అనుబంధాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి.
అందుకే కోట గారి మృతిపై రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు. తన అభిమానం, గౌరవాన్ని ఆయన పై సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఆ బాధ నుంచి కోలుకునేలోపే ఇప్పుడు తన నిజమైన తండ్రిని కోల్పోవడం… ఇది రవితేజ హృదయాన్ని తుదముట్టే దెబ్బగా మారింది.ఇప్పుడు రవితేజ ముఖం మీద చిరునవ్వు లేదు. మాస్మహారాజా కన్నీటితో ఉన్నాడు. అభిమానులు మాత్రం ఒక్కటే కోరుతున్నారు – “అన్నా.. మేము నీతో ఉన్నాం. ఈ బాధ నుంచి తొందరగా కోలుకో. మళ్లీ నవ్వుతూ కనిపించాలి.” అంటూ సోషల్ మీడియాలో వారి ప్రేమను జలిపిస్తున్నారు.