ఫిరాయింపే బాబు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వికి అర్హ‌తా..!

టీడీపీలో మంత్రివ‌ర్గ విస్త‌`ర‌ణం` మొద‌లైంది. అనేక చ‌ర్చోప‌చ‌ర్చ‌లు, సుదీర్ఘ మంత‌నాలు, సామాజిక‌వ‌ర్గాల కూడిక‌లు, తీసివేత‌లు వీట‌న్నింటినీ లెక్క‌లోకి తీసుకుని చివ‌ర‌కు 11 మందితో కూడిన మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు. ఐదుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న పలికారు. వారి ప‌నితీరు, సామాజికవ‌ర్గం.. వీట‌న్నింటినీ అర్హ‌త‌లుగా ప‌రిగ‌ణించిన బాబు.. కొత్త మంత్రుల ఎంపిక‌లో `ఫిరాయింపుదారుల‌`కే అధికంగా ప‌ట్టం క‌ట్ట‌డాన్ని ఇప్పుడు పార్టీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ మార‌డ‌మే మంత్రి ప‌ద‌వికి అర్హ‌త అనేలా అధికంగా వారికే ఎక్కువ‌గా మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాశ‌మైంది.

కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి 11మందికి మంత్రి పదవులు ఇవ్వడంపై అధికార, అనధికార, రాజకీయ పరిశీలకులు స్పందిస్తూ ఇది చంద్రబాబు మంత్రివర్గమేనా? అని వారు ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రి పదవి పొందినవారిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు మినహా మిగతా వారందరూ పార్టీలు మారిన వారేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మంత్రి పదవి పొందిన కళా వెంకటరావు 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత మళ్లీ టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు.

విజయనగరం జిల్లాకు చెందిన సుజయకృష్ణరంగారావు దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి విధేయుడు. ఆయన ప్రోద్బలం, సూచనలతో 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఇటీవలే ఆయన టీడీపీలో చేరారు. అలాగే వైఎస్ హ‌యాంలో మంత్రిగా చేసిన పీతాని సత్యనారాయణ.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరారు. ఇక కేఎస్ జ‌వ‌హ‌ర్‌.. రాజకీయాల్లోకి రాక ముందు ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చిరునామా ఎక్కడో ఎవరికీ తెలియదు.

చిత్తూరుకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డి టీడీపీ త‌ర‌ఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. 2014 ఎన్నికల్లో జగన్‌ పార్టీలో చేరారు. ఇటీవలే ఆయ‌న టీడీపీలో చేరారు. కాల్వ శ్రీనివాసులు 2014 ఎన్నికలకు ముందు జగన్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఫ‌లించ‌లేదు. టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశంలభించడంతో విజయం సాధించి అసెంబ్లీ చీఫ్‌విఫ్‌ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలప్రియ దివంగ‌త‌ భూమా నాగిరెడ్డి కుమార్తె. వీరు కూడా ఇటీవ‌లే టీడీపీలో చేరిన విష‌యం తెలిసిందే! కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి వై.ఎస్‌.కుటుంబానికి అత్యంత విధేయుడు, జగన్‌ గూటి నుంచి ఆయ‌న టీడీపీలో చేరిన‌వారే!