ఆ ఏపీ మంత్రి త‌ప్పులు ప్ర‌శ్నిస్తే ..కులం కార్డు తీసేస్తున్నారు

ఏపీలో అవినీతి పెరిగిపోయింది! ఇటీవ‌ల స‌ర్వ‌త్రా విన‌బ‌డుతున్న మాట‌. కొంద‌రు ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని నేరుగా సీఎం చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేస్తున్న ప‌రిస్థితి ఉంది. మ‌రీ ముఖ్యంగా మంత్రులే అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అవినీతిని స‌హించేది లేద‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రు మంత్రులు గుట్టుచ‌ప్పుడు కాకుండా మౌనంగా ఉంటుండగా మ‌రికొంద‌రు మాత్రం.. తాము ద‌ళిత వ‌ర్గానికి చెందిన వాళ్లం కావ‌డంతో కావాల‌నే మాపై బురద‌జ‌ల్లుతున్నార‌ని కులం కార్డుతో ఎదురు దాడి చేస్తున్నారు.

ఏపీ గ‌నులు, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి పీత‌ల సుజాత‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలోనూ వ‌చ్చాయి. ముఖ్యంగా ఉచిత ఇసుక స‌మ‌యంలో మంత్రి అనుచ‌రులు , బంధువులు పెద్ద ఎత్తున దందాల‌కు పాల్ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అదేవిధంగా ఓ మ‌హిళ సుజాత ఇంట్లో పెద్ద ఎత్తున డ‌బ్బును వ‌దిలి పెట్ట‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌ట్లో పెద్ద ఎత్తున మీడియాలో వ‌చ్చిన ఈ క‌థ‌నాన్ని మంత్రి త‌న స్టైల్‌లో తోసిపుచ్చారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఈమెను ప‌నిగ‌ట్టుకుని మంత్రిని చేశారు. అయితే, ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి అనేక ఆరోప‌ణలు వ‌చ్చాయి.

ఓ అనుమ‌తికి సంబంధించి రూ.కోటి విలువైన బంగారు ఆభ‌ర‌ణాన్ని మంత్రి పీత‌ల బ‌హుమ‌తిగా అందుకున్నార‌ని కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై ఆమె అప్ప‌ట్లో మౌనంగానే ఉన్నారు. ఇక‌, చింతలపూడి నియోజకవర్గంలో భూసేకరణ వ్యవహారంలో కోట్లాది రూపాయలు అక్రమంగా చెల్లించారని, భూముల రేట్లను అమాంతంగా పెంచారని విమర్శలు వచ్చాయి. ఈ క్ర‌మంలో మంత్రికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. భూముల రేట్ట‌ను పెంచిన అధికారిపై ప్ర‌భుత్వం వేటు వేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన అధికారి మాత్రం మంత్రి మాట‌నుప‌క్క‌న పెట్టి రూల్స్ ప్ర‌కారం ముందుకు వెళ్తున్నారు.

దీంతో ఒకింత ఆగ్ర‌హానికి గురైన పీత‌ల జిల్లా అధికారులు తనకు సహకరించడం లేదని విమర్శలు చేశారు. అంతే కాకుండా తాను దళిత మహిళా మంత్రిని కాబట్టి చిన్నచూపు చూస్తున్నారని తన సిఫార్సులను ఖాతరు చేయడం లేదని, ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ హెచ్చ‌రిక‌ల‌పైనా ఆ అధికారి ఏమీ బెదిరిపోలేద‌ట‌. త‌ప్పంతా ఆమె చేసి.. స‌రిదిద్దుకోకుండా.. నిజాయితీగా ఉన్న‌త‌మ‌ను కులం కార్డుతో బెదిరిస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. ఇదీ.. ఆ దళిత మ‌హిళా మంత్రి స్టోరీ.