చంద్రబాబు తలంటు పోసేశారు నిజమే!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా బిజెపి వ్యూహాల్ని అమలు చేస్తే, ఆ వ్యూహాలు విజయవంతమైనప్పుడు సుజనా చౌదరి బల్లలు చరుస్తూ ఆమోదం తెలపడం వివాదాస్పదమయ్యింది. మిగతా అంశాల్లో అయితే సుజనా చౌదరి తీరుని చంద్రబాబు సమర్థించేవారే.

కానీ అక్కడ ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టిన బిల్లు కావడంతో వివాదం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. దాంతో చంద్రబాబు, సుజనా చౌదరిపై తీవ్రంగానే అసహసనం వ్యక్తం చేసేసరికి హుటాహుటిన విజయవాడకు వచ్చిన సుజనా చౌదరి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను బల్లలు చరచలేదని వివరణ ఇవ్వవలసి వచ్చింది. ‘నేను అలా చేయలేదు, అలా వక్రీకరించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సుజనా చౌదరి చెప్పారు.

అంతే కాకుండా ఈ వారంలోనే ప్రత్యేక హోదాపై స్పష్టత రావొచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి లేదనీ, చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాకీ జిఎస్‌టి బిల్లుకి లింకు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మరి మీరెందుకు జిఎస్‌టి బిల్లుకి మద్దతిచ్చారు? అన్న ప్రశ్నకు మాత్రం సుజనా చౌదరి సమాధానం చెప్పలేదు. మిత్రపక్షంగా ఉంటూనే ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నట్లు సుజనా తెలిపారు.