టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్.. మాస్ హీరోలను బాగా హ్యాండిల్ చేస్తారన్న పేరు సంపాదించుకుంటారు. అయితే వారే దర్శకులుగా బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలను తెరకెక్కించడం మనం చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఇలా వేరే ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్న దర్శకులను మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఓ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. బాలీవుడ్ వెళ్లి అక్కడ డబ్ల్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. నిర్మాణంలో, రైటింగ్‌లో చిన్నపాటి అనుభవం ఉన్న చరణ్ తేజ్ ఉప్పలపాటి.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ భారీ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు.
ఈ పేరు గతంలో వినే ఉంటారు. నిఖిల్ సిద్ధార్థ్ మెయిన్ లీడ్ గా చేసిన స్పై సినిమా ప్రొడ్యూసర్లలో చరణ్ తేజ్ ఉప్పలపాటి ఒకడు. ఈ సినిమా టైటిల్ కార్డులో ఆయన పేరు సీఈఓ అని డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఆ యంగ్ ప్రొడ్యూసరే.. బాలీవుడ్ బడా సినిమాకు దర్శకుడుగా మారాడు. ప్రభుదేవా, కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాకు చరణ్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. భీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్ష, సార్ లాంటి సినిమాలతో హిట్స్ అందుకుని.. లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయం ఇంకా బయటకు రాలేదు. చరణ్ తేజ్ సొంతంగా నిర్మిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే స్పై సినిమా కథకు స్క్రీన్ ప్లే నిర్మాతలే చూసుకున్నారట.. ఆ అనుభవంతోనే చరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారంటూ తెలుస్తోంది. ఇక చరణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.