పుంగనూరు కేసులు..చల్లా-నల్లారిపైనే గురి..వైసీపీకి ప్లస్సేనా?

ఇటీవల చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో తంబళ్ళపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ, టి‌డి‌పి శ్రేణుల మధ్య దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే టి‌డి‌పి శ్రేణులని బాబు రెచ్చగొట్టి..వైసీపీ, పోలీసులపై దాడులు చేయించారని చెప్పి వైసీపీ నేత కేసు పెట్టగా, చంద్రబాబుతో సహ టి‌డి‌పి నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ రెండు చోట్ల ఏం జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. మొదట తంబళ్ళపల్లెలో బాబు టూర్ ఉంటే..వైసీపీ శ్రేణులు ఎందుకు వచ్చారు. రాళ్ళతో ఎందుకు దాడి చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఆ తర్వాత టి‌డి‌పి శ్రేణులు..వారిని తరిమికొట్టారని అంటున్నారు. ఇటు పుంగనూరు టౌన్ లోకి రోడ్ షో లేదని, బైపాస్ నుంచి వెళుతున్నా కూడా పోలీసులు అడ్డు తగలడం..టి‌డి‌పి శ్రేణులపై లాఠీ చార్జ్ చేయడం చేశారని, ఆ తర్వాత టి‌డి‌పి శ్రేణులు..పోలీసులపై రాళ్ళ దాడి చేశారని టి‌డి‌పి వర్గాలు అంటున్నాయి. ఈ దాడుల్లో టి‌డి‌పి, వైసీపీ శ్రేణులకే కాదు..పోలీసులకు గాయాలు అయ్యాయి. అయితే కేవలం టి‌డి‌పి శ్రేణులపైనే కేసులు పెట్టి వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికే బాబుతో సహ కీలక నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టారు. తనపైనే హత్యాయత్నం చేసి..తనపైనే కేసు పెట్టారని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. అయితే కేసు నమోదైన పుంగనూరు టి‌డి‌పి ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, పీలేరు ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కొందరు టి‌డి‌పి నేతలని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఇక టి‌డి‌పి నేతలు, కార్యకర్తలకు అండగా ఉండేలా టి‌డి‌పి అధిష్టానం న్యాయ సాయం అందిస్తుంది. అయితే ప్రధాన నేతలు చల్లా, నల్లారిలని అరెస్ట్ చేస్తే వైసీపీ రాజకీయంగా పై చేయి సాధించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో పుంగనూరు, తంబళ్ళపల్లెలో ఏం జరిగిందో అక్కడ ప్రజలకు బాగా తెలుసు. వైసీపీ తప్పు కూడా ఉందని భావించే పరిస్తితి ఉంది. అలాంటప్పుడు అరెస్టులు చేస్తే టి‌డి‌పి నేతలపై సానుభూతి..వైసీపీపై నెగిటివ్ రావచ్చు.