పశ్చిమ ప్రకాశంలో టీడీపీకి ఊపు..లీడ్ వచ్చినట్లేనా.!

తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం కూడా ఒకటి. మొదట నుంచి ఈ ప్రాంతంలో టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. ఈ ప్రాంతంలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎక్కువగా ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల ప్రభావం ఉంటుంది. అందుకే మొదట నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది.

కానీ ఈ సారి ఈ ప్రాంతంలో సత్తా చాటాలని టి‌డి‌పి చూస్తుంది. ఇదే క్రమంలో చంద్రబాబు పర్యటన జరిగింది. అయితే ఎప్పుడూలేని విధంగా పశ్చిమ ప్రకాశంలో బాబు పర్యటనకు ప్రజా స్పందన వచ్చింది. ఆ స్థాయిలో స్పందన వస్తుందని టి‌డి‌పి శ్రేణులే ఊహించి ఉండవు. ఎందుకంటే వీటి కంటే బాబు పర్యటన కృష్ణా జిల్లాలో జరిగింది మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు స్థానాల్లో బాబు టూర్ నడిచింది. ఆయా స్థానాల్లో టి‌డి‌పికి పట్టు ఉంది. కానీ ఆ స్థానాలని మించి పశ్చిమ ప్రకాశంలో బాబు టూర్ సక్సెస్ అయింది.

గిద్దలూరు, మార్కాపురం స్థానాల్లో భారీగా జనం వచ్చారు. రోడ్ షో గాని, సభకు గాని ఊహించని రీతిలో జనం పాల్గొన్నారు. ఇక యర్రగొండపాలెంలో ఊహించని విధంగా రోడ్ షో జరిగింది. అప్పటికే వర్షం వస్తుండటంతో సభ ప్రాంగణం దెబ్బతింది. దీంతో బాబు రోడ్డు కూడలిలో సభ పెట్టేశారు. వర్షం వచ్చిన జనం నిలబడ్డారు. అంటే ఏ స్థాయిలో బాబు టూర్ నడిచిందో అర్ధం చేసుకోవచ్చు.

దీని బట్టి చూస్తే ప్రకాశంలో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చిందనే చెప్పాలి. ఈ ఊపుని కొనసాగిస్తూ టి‌డి‌పి నేతలు ఇంకా కష్టపడితే పశ్చిమ ప్రకాశంలో ఆధిక్యం సాధించడం ఖాయమని చెప్పవచ్చు.