ఆర్ఆర్ఆర్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: RRR
నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలివియా మారిస్, అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని తదితరులు
సంగీతం: ఎంఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్
నిర్మాత: డివివి దానయ్య
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
రిలీజ్ డేట్: 25-03-2022

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, బాహుబలి సిరీస్ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతన్న RRR ప్రేక్షకులను ఎంతమేర మెప్పించింది.. ఈ సినిమా ఎలాంటి రికార్డులకు కేరాఫ్‌గా మారనుంది.. అనే అంశాలు ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
తెలంగాణను నిజాం పాలిస్తున్న సమయంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. నిజాం రాజును కలిసేందుకు వచ్చిన ఓ బ్రిటిష్ అధికారి, గోండు జాతికి చెందిన ఓ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తాడు. ఈ గోండు జాతికి కాపారిగా ఉండే భీమ్(తారక్)కు ఈ విషయం తెలియడంతో ఆమెను బ్రిటిష్ వారి నుండి కాపాడతాడు. ఈ క్రమంలో బ్రిటిష్ వారిపై అటాక్ చేసిన కొమురం భీమ్‌ను పట్టుకునేందుకు సీతారామరాజు(రామ్ చరణ్)ను బరిలోకి దింపుతారు. కానీ భీమ్‌లోని మంచితనం, నిజాయితీకి రామ్ ఆకర్షితుడై అతడికి సాయం చేస్తాడు.. బ్రిటిష్ వారికి ఎదురుతిరిగినందుకు రామ్‌కు మరణ శిక్ష విధిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. కట్ చేస్తే.. రామరాజు భార్య సీత(ఆలియా భట్)ను భీమ్ అనుకోకుండా కలుస్తాడు. ఆమెకు వచ్చిన కష్టం గురించి తెలుసుకున్న భీమ్ కోపంతో ఊగిపోతాడు. ఆమె భర్తను ఎలాగైనా కాపాడలని బ్రిటిష్ వారితో యుద్ధానికి సిద్ధమవుతాడు. మరి బ్రిటిష్ వారి నుండి రామరాజును భీమ్ ఎలా కాపాడతాడు..? వారిద్దరి మధ్య ఏర్పడే స్నేహం ఎలాంటి పరిణామాలాలకు దారి తీసింది..? వారిద్దరు కలిసి బ్రిటిష్ వారికి ఎలా ఎదురుతిరిగారు? అనే అంశాలు తెలియాలంటే మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాజమౌళి తనదైన ముద్ర వేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి కావాల్సిన అన్ని ఎమోషన్లను జక్కన్న పూర్తిగా వాడుకున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు, కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో వాటిని సినిమా మొత్తం క్యారీ అయ్యేలాగా రాజమౌళి చాలా తెలివిగా ఈ సినిమాలో చూపించాడు.

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇద్దరు హీరోల మధ్య కెమిస్ట్రీని వర్కవుట్ చేసిన విధానం ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత నచ్చేలా చేస్తుంది. అయితే బాహుబలి లాంటి సినిమా తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బాహుబలిని మించిన అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ ఆ సినిమా వేరు.. ఈ సినిమా వేరు.. ఆ బ్యాక్‌డ్రాప్ వేరు.. ఈ బ్యాక్‌డ్రాప్ వేరు. రెండింటిని వేర్వేరు సినిమాలుగా చూడాల్సిందే. లేకపోతే ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంలో బాహుబలిని అందుకోలేకపోతుందనే భావన వస్తుంది.

అలాగని ఆర్ఆర్ఆర్ సినిమా ఏమాత్రం తక్కువ స్థాయి సినిమా కాదు. ఈ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పక్కాగా కుదిరేలాగా జక్కన్న చూసుకున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలతో పండించాల్సిన ఎమోషన్స్, వారితో చేయించాల్సిన యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్ స్టెప్పులు.. ఇలాంటివి ఎక్కడా కూడా మిస్ కాకుండా జక్కన్న ఓ విందు భోజనాన్ని వడ్డించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ స్థాయి సినిమా అనుభూతిని ప్రేక్షకులను మిగిల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్, క్లాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను ఈ సినమాలో పొందుపరిచారు.

ఓవరాల్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ కావడంతో.. జక్కన్నతో పాటు రామ్ చరణ్, తారక్‌లు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పాలి. అటు ఈ సినిమాకు తెరపై నటించిన వారితో పాటు తెరవెనుక ఉన్నవారి కష్టాన్ని మనం వెండితెరపై స్పష్టంగా చూస్తాం.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాకు తారక్-చరణ్‌లు ఇద్దరు కూడా రెండు కళ్లల్లా మారారు. వాస్తవానికి ఈ సినిమాలో చరణ్ పాత్రకు స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువగా ఉంటుంది. అతడి ఎమోషన్స్, కోపం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రంగస్థలం తరువాత చరణ్ నుండి మరో క్లాసిక్ కల్ట్ పర్ఫార్మెన్స్‌ను మనం ఈ సినిమాలో చూస్తాం. అయితే తారక్ స్క్రీన్ ప్రెసెన్స్ చరణ్‌తో పోలిస్తే కాస్త తక్కువ.. కానీ మనకు అలా ఎక్కడా కూడా కనిపించకుండా చేశాడు ఈ టైగర్. మొరటు వ్యక్తిగా, దేన్నైనా ఎదురెళ్లి ఢీకొట్టే గుణం ఉన్న వ్యక్తిగా తారక్ పాత్రను మలిచిన తీరు అమోఘం. అతడిలోని ఎమోషన్స్‌ను పక్కాగా వాడుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉండటంతో వీరిద్దరినీ కలిసి చూసేందుకు రెండు కళ్లు చాలవు. అటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ పాత్ర ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ అని చెప్పాలి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాకు బలంగా ఉంటుంది. ఆలియా భట్ సీత పాత్రలో అందరినీ మెప్పించింది. తన ఎమోషన్స్, స్క్రీన్ ప్రెసెన్స్‌తో ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తుంది. మిగతా వారు తమకిచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
కెప్టెన్ ఆఫ్ ది షిప్.. జక్కన్న గురించి ఎంతచెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. ఒక పీరియాడిక్ కథకు ఫిక్షన్‌ను జోడించి.. రెండు విభిన్న పాత్రలను ఒకేచోట కనిపించేలా చేయాలనే రాజమౌళి ఆలోచను సెల్యూట్ కొట్టాల్సిందే. అసలు ఇలాంటి ఆలోచన రావడమే కాదు.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చూస్తే జక్కన్నను మెచ్చుకోక ఉండలేరు. ప్రేక్షకులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా, సినిమాపై ఆసక్తిని సన్నగిల్లకుండా చూసేందుకు జక్కన్న తీసుకున్న జాగ్రత్తలు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు మేటి స్టార్స్ నటిస్తుండటంతో, వారిలోని పూర్తి నటులను వాడుకోవడంలోనూ జక్కన్న తన మార్క్ చూపించాడు. అటు సెంథిల్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా చేస్తుంది. ప్రతి సీన్‌లోని వేరియేషన్, ఎగ్జిక్యూషన్ మనల్ని సీట్లలోనుండి లేవకుండా చేస్తుంది. కీరవాణి సంగీతం, బీజీఎం రెండు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్‌గా ఉన్నాయో ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్లు చూస్తే ఊహించుకోవచ్చు.

చివరగా:
RRR – రికార్డులను తిరగరాసే రాజమౌళి మార్క్ సినిమా!

రేటింగ్:
3.75/5.0