ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే.

అయితే ఇక్కడ సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. అసలు ముందస్తు లేదనే సంజాయిషీ, లేదా వివరణ ప్రభుత్వం తరఫు నుంచి ఇన్నిసార్లు చెబుతున్నారు ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డికి గానీ, జగన్మోహన్ రెడ్డికి గానీ వ్యవహార సరళిలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అర్థం పర్థం లేని వాదనలను విపక్షాలు ప్రచారంలో పెడితే.. వారు వాటిని పట్టించుకోరు. ‘ఇగ్నోర్’ చేస్తారు. ఎవరైనా విలేకరులు ప్రత్యేకంగా ఆ విషయాలను వారివద్ద ప్రస్తావించి, వారినుంచి బలవంతంగా సమాధానం రాబట్టాలని చూసినా కూడా సాధ్యం కాదు. ఆ విమర్శలను ఛీత్కరించుకుంటారు తప్ప.. జవాబు ఇవ్వరు. జగన్ శైలి కూడా ఇంచుమించు అంతే.
అధికార పార్టీ వాళ్లు చెబుతున్న దాన్ని బట్టి.. జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనే సంగతిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రచారంలో పెట్టారని అనుకుందాం. తద్వారా ప్రభుత్వం పట్ల ఒక అస్థిర భావనను ప్రజల్లో సృష్టించాలని ఆయన అనుకున్నారే అనుకుందాం. అంతమాత్రాన ఒక పసలేని నిరాధార ఆరోపణల పట్ల ప్రభుత్వం తరఫునుంచి ఎందుకు స్పందించాలి?

జగన్ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే ఊహాగానాలు ఏదో ఒక రాజకీ మాటలను ప్రచారంలో పెట్టుకోడానికి బాగానే ఉంటాయి. ఇటీవలి కొన్ని నిర్ణయాలు జగన్ సర్కారు సహజశైలికి భిన్నంగా కనిపిస్తున్నాయి గనుక.. వాటికి ముడిపెట్టి తెలుగుదేశం పార్టీ ముందస్తు పేరుతో ఒక విషప్రచారానికి శ్రీకారం చుట్టిందే అనుకుందాం. అంతమాత్రాన అధికార పార్టీ స్పందించడమే చిత్రంగా ఉంది.

‘ఎవరో దారినపోయే దానయ్య ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వివరణ ఇస్తూ కూచోవాలంటే అసలు అవుతుందా?’ అన్నట్టుగా.. వాళ్లు ఆ ప్రచారాన్ని ఇగ్నోర్ చేసి ఉంటే.. ప్రచారం చాలా త్వరంగానే చప్పున చల్లారిపోయి ఉండేది. దానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు అందరూ వివరణలు ఇవ్వడం వలన.. ముందస్తు ఎన్నికలు అనే మాటే.. ప్రజల్లో సుదీర్ఘకాలం నానుతున్నట్టుగా కనిపిస్తోంది. ముందస్తు గురించి ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతోంది.
వైసీపీ పెద్దల సహజశైలి ప్రకారం.. ఇగ్నోర్ చేయడం వారి రాజకీయ టెక్నిక్. పట్టించుకోకుండా ఉండడం ద్వారా.. ప్రత్యర్థిని మానసికంగా డిఫెన్స్ లో పడేయడం వారి శైలి. అయితే ఈసారి కొంత భిన్నంగా వ్యవహరించారు. ఎంపీలు, మంత్రులు ఎక్కడికక్కడ విలేకరులు అడిగినప్పుడు ముందస్తు ప్రచారాన్ని ఖండించడం ఓకే. కానీ ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడే ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా ముందస్తు ప్రచారాన్ని ఖండించడం.. మేం పూర్తికాలం అధికారంలో ఉంటాం అని వాక్రుచ్చడం.. ఏదో బింకంగా కనిపిస్తోంది.