జ‌గ‌న్‌కు చిన్నాన్న షాక్‌

శాస‌న‌మండ‌లి ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు ఝ‌లక్ త‌గ‌ల‌బోతోంది. పార్టీ వ్య‌వ‌హారాల‌తో పాటు కుటుంబ క‌ల‌హాలు కూడా ఇప్పుడు జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇప్ప‌టికే ఒక చిన్నాన్న పార్టీలోకి తిరిగి వ‌స్తే.. మ‌రో చిన్నాన్న ఇప్పుడు పార్టీ నుంచి వెళిపోయేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. కొంత‌కాలం నుంచి వైఎస్ కుటుంబంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో ఆయ‌న క‌ల‌త చెందార‌ట‌. దీంతో త‌న‌ కుటుంబంతో స‌హా జ‌గ‌న్‌కు దూర‌మ‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

జగన్‌ సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడిన సమయంలో వైఎస్‌ కుటుంబంలో అసంతృప్తి చెల‌రేగ‌డం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జ‌గన్‌ చిన్నాన్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మనోహర్‌రెడ్డి సతీమణి ప్రమీళ పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు. మనోహర్‌రెడ్డి కూడా కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. కొంతకాలంగా మనోహర్‌రెడ్డి వైఎస్‌ కుటుంబంలోని కొందరి వ్యవహారశైలిపై అంసతృప్తిని వ్యక్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మున్సిపాలిటీలో వారి జోక్యం ఎక్కువగా ఉండటం, వైస్‌ చైర్మన్‌ పదవి వ్యవహారం కూడా వీరి మధ్య విభేదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇందుకు తోడు ఇటీవల పులివెందుల మున్సిపల్‌ కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరగడం మరో కారణంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇవే కాకండా కొన్ని ఆర్థికపరమైన అంశాలు కూడా కలహాలకు కారణమైనట్లు ప్రచారం సాగుతోంది.

దీంతో మనోహర్‌రెడ్డి త‌న‌ పదవులకు కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఇదే సమ‌యంలో ఆయ‌న టీడీపీకి దగ్గరవుతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆయ‌న‌ అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చని వైసీపీకీ దూరంగా మాత్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకొస్తున్నారు.