మళ్ళీ తొక్కిసలాట..కుట్ర ఉందా?ప్రచార పిచ్చేనా?

ఇటీవల కందుకూరు ఘటనని మరవక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగగా, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా, అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి..ఊహించని విధంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. భారీ ఎత్తున ఆర్ధిక సాయం అందించారు.

ఇక ఆ ఘటన ఇప్పుడుప్పుడే మరుస్తున్నారనే అనుకునేలోపు. గుంటూరులో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజు గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత సభా ప్రాంగణం బయట ఉన్న లారీల్లో ఉంచిన కానుకలను పంచుతుండగా.. ఒకేసారి అందరూ ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాటకు గురై..ముగ్గురు మహిళలు మృతి చెందారు.

3 killed, several injured in stampede at Chandrababu Naidu's meeting in  Andhra Pradesh's Guntur | Vijayawada News - Times of India

వాస్తవానికి కొందరు సీనియర్‌ టీడీపీ నేతలు.. కానుకల పంపిణీని వార్డుల వారీగా పెట్టుకుందామని సూచించినా నిర్వాహకులు పట్టించుకోలేదని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనకు బాధ్యత తనదే అని, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు ప్రకటన చేశారు. అలాగే ఒక్కో కుటుంబానికి 20 లక్షల సాయం కూడా ప్రకటించారు. అటు ముగ్గురు చనిపోయిన ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇక టీడీపీ నేతలు కూడా తమవంతు సాయం ప్రకటించారు.

అయితే మొన్న కందుకూరులో, ఇప్పుడు గుంటూరులో ఈ ఘటన జరగడంపై తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కానీ ఇలా వరుసగా ఘటనలు జరగడంలో ఏదో కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక యథావిధిగానే చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల మహిళలు చనిపోయారని మంత్రి విడదల రజిని అన్నారు. ప్రభుత్వం తరుపున చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు సాయం ప్రకటించారు. మరి ఈ వరుస ఘటనల్లో ఏదైనా కుట్ర ఉందా? లేక ప్రచార పిచ్చి ఉందా? అనేది క్లారిటీ లేదు.