జూనియర్‌తో మాట్లాడొద్దని బాబు ఒట్టు..వంశీకి 8 ఏళ్ళు పట్టింది.!

రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేరు గాని..ఆయన చుట్టూ మాత్రం రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. గత ఎన్నికల నుంచి మరీ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోవడంతో, ఇంకా పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అలాగే చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్లోగన్స్‌తో హల్చల్ చేస్తారు. అటు వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఎన్టీఆర్ పేరు ఎక్కువ ప్రస్తావిస్తారు. చంద్రబాబు , ఎన్టీఆర్‌ని మోసం చేశారని, ఆయన్ని తొక్కడానికి చూస్తున్నారని చెప్పి..జూనియర్ అభిమానులకు బాబుపై కోపం పెంచేలా చేసి…వారిని వైసీపీ వైపుకు తిప్పుకోవాలని చూస్తారు.

ఇక తాజాగా అలాంటి అంశమే మరోసారి వల్లభనేని వంశీ తెరపైకి తీసుకొచ్చారు. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..జూనియర్ ప్రస్తావన తెచ్చారు. ఈ సారి కొత్త విషయాన్ని వంశీ బయటపెట్టారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడి జూనియర్ ప్రచారం చేసినా సరే..ఎన్నికలయ్యాక జూనియర్ ఎక్కడైతే తిరిగారో ఆ స్థానాల్లో టీడీపీ ఓడిపోయిందని నెగిటివ్ ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.

అలాగే తనకు సీటు ఇచ్చేటప్పుడు కూడా ఎన్టీఆర్‌తో మాట్లాడకూడదని చంద్రబాబు ఒట్టు వేయించుకున్నారని, ఎన్టీఆర్‌తో తనకు ఇబ్బంది ఉందని, 2009లో తాను విజయవాడ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయానని, ఇవన్నీ చెబితే, ఎందుకు అనవసరమైన ఇబ్బందులు అని నోరు మెదపలేదని వంశీ చెప్పుకొచ్చారు. అంటే 2014లో గన్నవరం సీటు వంశీకి ఇచ్చారు. అప్పుడు బాబు ఒట్టు వేయించుకున్నారని అంటున్నారు.

అంటే దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది..మరి 8 ఏళ్ల తర్వాత ఒట్టు వేయించుకున్న విషయం వంశీకు గుర్తొచ్చిందా? అని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అప్పుడేమో బాబు సీటు ఇస్తే తీసుకుని గెలిచి..మళ్ళీ 2019లో సీటు తీసుకుని గెలిచి..వైసీపీలోకి జంప్ చేసిన తర్వాత బాబు ఒట్టు వేయించుకున్నారనే విషయం గుర్తొచ్చిందా? అని విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని వంశీ భుజాన వేసుకున్నారని, ఇంకా జూనియర్ అభిమానులని టీడీపీకి దూరం చేసి, వైసీపీకి లబ్ది చేకూరేలా చేయాలని చూస్తున్నారని, అందుకే ఈ డ్రామాలు అని అంటున్నారు. మరి బాబు, వంశీ మధ్య ఏం జరిగిందో వారికే తెలియాలి.