ఈ సారి టీడీపీ టిక్కెట్ కావాలంటే కొత్త రూల్ పాటించాల్సిందే !!

ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి పార్టీ అధిష్టానం పెడుతోన్న రూల్స్‌తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని కొత్త రూల్స్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. ఎంత పెద్ద నేత అయినా.. ఎంత సీనియ‌ర్ నేత అయినా కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కావాలంటే ముందు డ‌బ్బు సంచులు ఉండాల‌ట‌. ఈ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేస్తున్నార‌ట పార్టీ పెద్ద‌లు.

వచ్చే ఎన్నికలు పార్టీకి.. ఇంకా చెప్పాలంటే చంద్ర‌బాబుకు చావోరేవో లాంటివి. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించ‌క‌పోతే ఇక చంద్ర‌బాబు మ‌రోసారి సీఎం ఎప్ప‌ట‌కీ కాలేరు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన్ని అస్త్ర‌శ‌స్త్రాల‌ను వాడుతున్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో డబ్బులు ఉంటేనే టికెట్.. అని తేల్చి చెప్పారట. రీసెంట్‌గా ప్ర‌కాశం జిల్లాలో నిర్వ‌హించిన మ‌హానాడులో కొంద‌రు నాయ‌కులు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారు.. చంద్రబాబు, లోకేష్‌తో మాట్లాడారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు కావాల‌ని అడిగితే చంద్రబాబు, లోకేష్ ఇద్ద‌రూ కూడా డ‌బ్బులు ఉంటేనే టికెట్ ఇస్తామని.. తేల్చి చెప్పారని.. పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే పార్టీ కోసం ఖ‌ర్చు పెట్ట‌కుండా, కార్య‌క్ర‌మాలు చేయ‌కుండా కూడా టిక్కెట్ ఇవ్వ‌మ‌ని అడిగితే కుద‌ర‌ద‌నీ చెప్పేశార‌ట‌. వైసీపీ అధికారంలో ఉంది.. పైగా ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంది. వైసీపీ గ‌ట్టి పోటీని త‌ట్టుకోవ‌డం అంటే మాట‌లు కాద‌నే బాబు, లోకేష్ చెపుతున్నార‌ట‌.

అందుకే ఆర్థికంగా నాలుగు రూపాయ‌లు బ‌య‌ట‌కు తీసే వాళ్ల‌కే ఈ సారి టిక్కెట్లు అంటున్నారు. అయితే పార్టీ కోసం ఏళ్ల‌కు ఏళ్లుగా క‌ష్ట‌ప‌డిన వారు.. సీనియ‌ర్ల ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా ప‌లు జిల్లాల్లో ప‌నిచేయ‌ని ఇంచార్జ్లు డబ్బు ఖర్చు పెట్టకుండా.. యాక్షన్ చేస్తున్నవారిని పక్కన పెట్టాలని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఇప్పుడు ఈ నిర్ణ‌యం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు కానుంద‌ని టాక్ ?