సోము ఇలా.. కేంద్రం అలా.. టీడీపీపై క్లారిటీ ఇస్తుందా..!

తెలుగు దేశం పార్టీ విష‌యంలో రాష్ట్ర బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రి స్ప‌ష్టంగానే ఉంది. ఇక్కడి నాయ‌కు లు.. టీడీపీని స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము జ‌న‌సేనతోనే క‌లిసి పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు. నిజానికి ఇలా చేసుకునే గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయా మ‌నే వాద‌న బీజేపీలో ఉంది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించి.. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని.. కొంద‌రు చెబుతున్నారు.

ఇక‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము మాత్రం.. తాము జ‌న‌సేన‌తో ఉన్నామ‌ని.. జ‌న‌సేన‌తోనే ఉంటామ‌ని.. వేరే పార్టీ తో జ‌ట్టు క‌ట్ట‌బోమ‌ని స్ప‌స్టం చేస్తున్నారు. అయితే.. కొంత మేర‌కు.. ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు త‌గ్గించ డం గ‌మ‌నార్హం. గ‌తంలో రాజ‌ధాని విష‌యం తీసుకున్నా.. ఆల‌యాల విష‌యాన్ని తీసుకున్నా.. టీడీపీపై విమ‌ర్శ‌లు చేసే వారు. కానీ.. కొన్నాళ్లుగా వైసీపీని మాత్ర‌మే విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీకి చేరువ అవుతున్నారా? అనే సందేహాలు అయితే.. రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌చ్చాయి.

కానీ, సోము మాత్రం.. దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు..కొట్టి పారేస్తున్నారు. క‌ట్‌చేస్తే.. ఏపీ బీజేపీ టీడీపీ విష‌యంలో ఇంత‌క్లారిటీగా ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. కానీ, కేంద్రంలోని బీజేపీ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉండ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్వ‌యంగా చంద్ర‌బాబును.. ప్ర‌ధాని మోడీ పాల్గొనే కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డం.. అది కూడా కేంద్ర మంత్రి హోదాలో జి. కిష‌న్ రెడ్డి ఆయ‌న‌క స్వయంగా ఫోన్ చేయ‌డం వంటివి చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

ఇవ‌న్నీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుచూపుతో క‌మ‌ల నాథులు పునాదులు వేసుకుంటున్నారా? అనే సందేహాలు క‌లుగుతున్నాయి. మ‌రోవైపు… ఈ ప‌రిణామాల‌ను ఏపీ బీజేపీ నాయ‌కులు ఎలా చూస్తార‌నే చూడాలి. ఎందుకంటే.. వారు కోరి మ‌రీ టీడీపీకి దూరం అవుతున్నారు. కేంద్రంమాత్రం కోరి మ‌రీ..చంద్ర‌బాబును ఆహ్వానిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీపై అస‌లు బీజేపీకి క్లారిటీ ఉందా? అనేది సందేహంగామారింది. చూడాలి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో!!

Share post:

Latest