రాజాన‌గ‌రం మ‌ళ్లీ ‘ రాజా ‘ దే… జ‌క్కంపూడి స‌క్సెస్ మంత్రం ఇదే..!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ నుంచి గత ఎన్నికలలో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాజా టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై ఘ‌న‌జయం సాధించారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయలేన‌ని పెందుర్తి చేతులు ఎత్తడంతో చంద్రబాబు తర్జనభజనలో పడి చివరకు పెద్దాపురం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరిని ఇన్చార్జిగా దిగుమతి చేశారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యక్రమాలు చేసే నాథుడే లేకపోవడంతో తెలుగుదేశం అతి గతి లేకుండా పోయింది.

బొడ్డు వెంకటరమణ చౌదరి వచ్చాక కూడా పార్టీ అనుకున్నంత వేగంగా పుంజుకోవటం లేదన్న నివేదికలు అయితే అధిష్టానానికి వెళ్లిపోయాయి. వెంకటరమణ చౌదరిని రాజానగరం నుంచి తప్పించి రాజమహేంద్రవరం లోక్సభ బరిలో దింపితే ఎలా ? ఉంటుందన్న చర్చలు కూడా పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి. జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ‌ విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నా… ఆయనకు పవన్ అభిమానులు కూడా పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. బత్తుల ఎన్ని లక్షల ఖర్చు పెడుతున్నా ఆయన ఆయనకు వ్యక్తిగత చరిష్మా అంతగా లేకపోవడం… ఆయ‌న బిహేవియ‌ర్‌, నేప‌థ్యం పెద్ద మైనస్ గా మారింది. దీనికి తోడు వ్యక్తిగత ఇమేజ్‌లో ఇటు జక్కంపూడి రాజాకు గాని.. అటు బొడ్డు వెంకటరమణ చౌదరికి గాని ఏ మాత్రం సరితూగే వ్యక్తి కూడా కాదు.

ఇక జక్కంపూడి విషయానికి వస్తే పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతిష్టాత్మకమైన కాపు కార్పొరేషన్ పదవిని జగన్ కేటాయించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నియోజకవర్గంలో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేయటం ఆయనకు ఫ్ల‌స్ కానుంది. ముఖ్యంగా నియోజకవర్గ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనట్టుగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు సీతానగరం రహదారి చక చక పూర్తి చేస్తూ ఉండటం.. కాపు కార్పొరేషన్ ద్వారా భారీగా రుణాలు మంజూరు చేయించడం.. ప్రధాన, అంతర్గత రహదారులు… పుంతరహదారులు పూర్తి చేయటం ఇవన్నీ రాజా కాలంలోనే పూర్తయ్యాయి.

దీనికి తోడు వ్యక్తిగతంగా వివాద రహితుడు కావడంతో పాటు అందరినీ కలుపుకుపోవడం.. సామాజిక సమీకరణలపరంగా అన్ని కులాలకు పదవులు కట్టబెట్టడం… ఇవన్నీ కులాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా రాజకు ప్రజల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. క‌మ్మ‌ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండే సీతానగరం మండలంలో రెండు మండల పార్టీ అధ్యక్ష పదవులతో పాటు జడ్పిటిసి పదవిని కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కట్టబెట్టారు. ఇక రాజానగరం, కోరుకొండ రెండు జడ్పిటిసి పదవులను కూడా బీసీల్లో బలమైన శెట్టిబలిజ వర్గానికి ఇచ్చారు. ఇక రెండు ఎంపీపీ పదవులు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి కేటాయించారు.

ఇక జక్కంపూడి ఫ్యామిలీ అంటేనే ముందు నుంచి ఎస్సీలు, మైనార్టీలు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. సీఎం జగన్ దగ్గర జక్కంపూడి కుటుంబానికి మంచి ర్యాపో ఉండడం కూడా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు రాబట్టడంలో బాగా యూజ్‌ అయింది. ఇవ‌న్నీ రాజా గెలుపు సీక్రెట్లు కానున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న జనసేన, తెలుగుదేశం రాజకీయంగా అభ్యర్థుల విషయంలో ఇంకా డైల‌మాలో ఉన్న వేళ ఇటు రాజా రోజుకి మరింత బలమైన శక్తిగా మారుతున్నారు. ఇదే ప‌రిస్థితి ఉంటే రాజాకు వచ్చే ఎన్నికల్లో తిరగులేని వాతావరణమే రాజనగరంలో కనిపిస్తోంది.