టీడీపీ సూపర్ సిక్స్..ప్రజల్లోకి వెళుతున్నాయా?

నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదమనే సంగతి తెలిసిందే.అందుకే చంద్రబాబు గట్టిగా కష్టపడుతూ…పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో మహానాడులో మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

సూపర్ సిక్స్ అంటూ ఓ ఆరు అంశాలతో మేనిఫెస్టో రూపోదించారు. అయితే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టి‌డి‌పి నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పథకాల ద్వారా సంవత్సరానికి రూ.లక్షన్నర లబ్ది జరుగుతుందని…5 ఏళ్ళకు 6 లక్షలు ఒకో కుటుంబానికి అందుతుందని చెప్పుకొచ్చారు. టి‌డి‌పి సూపర్ సిక్స్  హామీలు..

మహాశక్తి: 18 ఏళ్ల పైబడిన మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు. ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో చదువుకునే పిల్లలు అందరికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

యువగళం: నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన

అన్నదాత: రైతులు పడుతున్న కష్టాలు తీర్చే లక్ష్యంగా ఏడాదికి రూ.20 వేలు సాయం

ఇంటింటికీ నీరు: ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు ఇచ్చేలా ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌

పూర్‌ టు రిచ్‌: పేదల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేసి సంపన్నులను చేయడం

బీసీ రక్షణ చట్టం: వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ రక్షణ చట్టం తెచ్చి అండగా నిలవడం.

ఇవి టి‌డి‌పి ఇచ్చిన హామీలు…వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టి‌డి‌పి నేతలు పనిచేస్తున్నారు. అయితే ఇవి ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లలేదు..పూర్తి స్థాయిలో వెళితే టి‌డి‌పికే బెనిఫిట్.