టీడీపీలోకి సుచరిత..రెండు సీట్లు ఆఫర్?

ఇటీవల అధికార వైసీపీలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆ విమర్శల దాడిని మరింత పెంచారు. దీంతో ఆయనని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఆనం..టీడీపీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం అసంతృప్తిగానే ఉన్నారు.

ఈయనకు నెక్స్ట్ వైసీపీలో సీటు దొరకదనే ప్రచారం ఉంది. దీంతో వసంత టీడీపీలోకి వస్తారని ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో జగన్‌కు విధేయురాలుగా ఉంటూ మొదట నుంచి వైసీపీలో పనిచేస్తున్న మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత సైతం తాజాగా బాంబు పేల్చారు. తన భర్త రాజకీయం ఏ పార్టీలోకి వెళితే తాను కూడా భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే అని చెప్పారు. అంటే సుచరిత భర్త దయాసాగర్..టీడీపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

పైగా సుచరితకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గిపోయింది..మంత్రివర్గం నుంచి తప్పించారు..ఇటు జిల్లా అధ్యక్షురాల పదవి పోయింది. ఇక నెక్స్ట్ సీటు గ్యారెంటీ అని విషయం తేల్చడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సుచరిత భర్త..టీడీపీతో టచ్‌ లో ఉన్నట్లు తెలిసింది..ఇక తన భర్త ఎటు వెళితే తాను అటు వెళ్తానని సుచరిత తాజాగా మాట్లాడారు.

అయితే దయాసాగర్‌కు టీడీపీలో బాపట్ల ఎంపీ సీటు ఇస్తారని ప్రచామ్ జరుగుతుంది. గత ఎన్నికల్లో అక్కడ మాల్యాద్రి పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన పెద్దగా కనిపించడం లేదు. దీంతో దయాసాగర్‌ని బాపట్ల ఎంపీగా బరిలో దింపుతారని అంటున్నారు. ఇటు సుచరితకు ప్రత్తిపాడు ఖాయమని చెబుతున్నారు. చూడాలి సుచరిత ఫ్యామిలీ వైసీపీని వీడుతుందో లేదో.