‘ఎమ్మెల్యేలకు ఎర’: కేసీఆర్‌ టార్గెట్ రీచ్ అవుతారా?

గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక హడావిడితో పాటు, నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేయడానికి చూసిన ఆడియో, వీడియోలపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. మునుగోడు సభలో మాత్రం వందల కోట్లు ఆఫర్ ఇచ్చిన..ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మని కాపాడారని చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా దీనిపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాల టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. ఉపఎన్నిక ముగియడం, ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ వైపే ఉండటంతో..అనూహ్యంగా కేసీఆర్ ప్రెస్ ముందుకు వచ్చి..ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియో, వీడియోలు మీడియా ముందు ప్రదర్శించారు. వాటిల్లో ముగ్గురు వ్యక్తులు ఎలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో బేరం ఆడుతున్నారో స్పష్టంగా ఉంది. అలాగే అమిత్ షా, బి‌ఎల్ సంతోష్ అనే పేర్లు ఎక్కువసార్లు వారు చెప్పుకొచ్చారు…మోదీ పేరు కూడా ఒకటి రెండు సార్లు వచ్చింది.

అయితే ఇదంతా పైనున్న వాళ్లే చేయిస్తున్నారని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూలగొట్టారని ఇప్పుడు, తెలంగాణతో పాటు ఏపీ, ఢిల్లీ, రాజస్తాన్‌లోని ప్రభుత్వాలని కూలగొట్టడానికి చూస్తున్నారని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చారు. కొనుగోళ్ల పర్వాన్ని, ఈ దాడిని ఆపండని,  దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతకనీయండని కేసీఆర్..మోదీ టార్గెట్‌గా మాట్లాడారు. షా, మీ పేరు చెప్పి.. అరాచకం చేస్తున్నారని,  కొనుగోళ్ల బాధ్యులను జైల్లో పెట్టండని, ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని,  మోదీకి కేసీఆర్‌ హితవు పలికారు.

కొనుగోలుకు సంబంధం ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్..వీడియోలు, ఆడియోలు ప్రదర్శిస్తూ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈ ముఠాలో దేశవ్యాప్తంగా 24 మంది ఉన్నారని, వీళ్లకు వేల కోట్లు ఇస్తున్నదెవరు? ముఠా నాయకుడెవరు? ఈ వివరాలన్నీ బయటకు రావాల్సిందే, దీనిపై సుప్రీం కోర్టు కలుగజేసుకుని విచారించాలని కేసీఆర్‌ డిమాండ్ చేశారు.

ఈ కొనుగోలు అంశంతో బీజేపీని టార్గెట్ చేస్తూ..దేశ రాజకీయాల్లో తన పాత్రని ఇంకా పెంచుకోవాలనే దిశగా కేసీఆర్ ప్రయత్నించినట్లు కనిపించింది. అయితే ఇలాంటి అంశాలతో కేంద్రం ఇరుకున పడటం అనేది కష్టమే. ఏదో తెలంగాణ వరకు కేసీఆర్ ప్రభావం ఉంటుందేమో గాని..దేశ వ్యాప్తంగా ప్రభావం ఉండకపోవచ్చు.